ఈ నెల 23న తెలంగాణకు అమిత్ షా
తెలంగాణ పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది.
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 23వ తేదీన తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ఆయన పర్యటించనున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆయన పర్యటన కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ లో దాదాపు లక్షకు పైగా మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి అమిత్ షా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచారంలో పాల్గొననున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా అటు కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ ఆయన పర్యటించనున్నారు.
దక్షిణాదిపై గురిపెట్టిన కమలం పార్టీ నేతలు కర్ణాటక ఎన్నికల్లో అధికారాన్ని కాపాడుకుని తెలంగాణలోనూ పాగా వేయాలని చూస్తోంది. అందుకే షా పర్యటన ఉండనుందని సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే అమిత్ షా పర్యటన పలుమార్లు రద్దయింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో కానీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ల పరిధిలో పర్యటించాల్సి ఉన్నా.. ఆ టూర్ వాయిదాపడింది. కాగా తాజాగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నిర్వహించే పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా అమిత్ షా పాల్గొంటారని తెలుస్తోంది. కొద్దిరోజులుగా చేరికలను భారీగా పెంచాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు ఆదేశించింది.
అయితే వికారాబాద్‌లో నిర్వహించే సభలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు కాషాయతీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ఇదిలా ఉండగా అమిత్ షా టూర్, లక్ష మందితో భారీ బహిరంగ సభపై మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ కన్వీనర్లు, ప్రభారీలు, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జీలతో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి బన్సల్ నిర్వహించే సమావేశంలో మరింత స్పష్టత రానుంది. కాగా సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వికారాబాద్ లో పర్యటించి పరిశీలన చేపట్టినట్లు తెలుస్తోంది.