మోడీతో అమిత్ షా, నడ్డా భేటీ! బండి అంశంపై చర్చ
ప్రధాని మోడీతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన తర్వాతి పరిణామాలు ఢిల్లీ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో ప్రధానితో కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బుధవారం ఉదయం సమావేశమయ్యారు. నిర్దిష్టంగా ఆ ముగ్గురూ ఏ విషయం గురించి చర్చించుకున్నారనేది అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ బండి సంజయ్ అరెస్టు, దానికి దారితీసిన కారణాలు, తదుపరి పరిణామాల గురించి చర్చించుకున్నట్లు తెలిసింది.
ఈ ముగ్గురి భేటీ తర్వాత అమిత్ షా, నడ్డా విడిగా కొద్దిసేపు భేటీ అయ్యారు. బండి సంజయ్ అరెస్టు గురించి లోతుగా చర్చించుకున్నట్లు తెలిసింది. లీగల్ కోణం నుంచి తీసుకోవాల్సిన చర్యలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే డీజీపీకి ఫోన్ చేసి బండి సంజయ్ అరెస్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీశారు.