తెలంగాణ బీజేపీలో విభేదాలు.. స్పందించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ బీజేపీ నేతల మధ్యం సమన్వయం కొరవడిందని.. విభేదాలు మొదలయ్యాయని పలు పత్రికలు కథనాలు రాస్తోన్న విషయం తెలిసిందే.

Update: 2024-09-10 07:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం కొరవడిందని.. విభేదాలు మొదలయ్యాయని వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ కథనాలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని కొట్టిపారేశారు. అదంతా మీడియా సృష్టే అని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. కోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని తెలిపారు. బీజేపీ రిట్ పిటిషన్‌కు అనుగుణంగా కోర్టు తీర్పు వచ్చిందని అన్నారు. హైకోర్టు తీర్పును మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్వాగతించారని.. తీర్పును వెంటనే అమలు పరిచేలా సీఎం రేవంత్, అధ్యక్షుడు ఖర్గేకు చెప్పాలని మంత్రి పొన్నంకు ఏలేటి విజ్ఞప్తి చేశారు.

ఫిరాయింపులు ప్రొత్సహించబోమని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొందని గుర్తుచేశారు. ఏఐసీసీ నిర్ణయాలకు విరుద్ధంగా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. తక్షణమే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపుదారుడికి పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ ముగ్గురి పేర్లు పంపితే.. మీరు మీ నాయకుడి పేరు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ‘ఆర్ ఆర్’ కాంగ్రెస్‌కు ఏఐసీసీకి మధ్య గ్యాప్ ఉందని కీలక ఆరోపణలు చేశారు. ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం.. ఆ పార్టీ సీనియర్లకు ఇష్టం లేదని అన్నారు. అందుకే చేరికల సమయంలో ఏ ఒక్క సీనియర్ లీడర్ కూడా రేవంత్ వెంట లేడని అన్నారు. సీఎం పదవి రేవంత్‌కు దిన దిన గండంగా మారిందని తెలిపారు.


Similar News