Telangana Group 1 Mains Exams : ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 పరీక్షలు..

గ్రూప్‌-1 మెయిన్స్ కు సర్వం సిద్ధమైంది. పరీక్షలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27వ తేదీ వరకు జరగనున్నాయి.

Update: 2024-10-18 16:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రూప్‌-1 మెయిన్స్ కు సర్వం సిద్ధమైంది. పరీక్షలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఇదిలా ఉండగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించినా వారికి అనుకూలంగా తీర్పు రాకపోవడంతో అధికారులు పరీక్షకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం అధికారులు తెలంగాణ వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 31,383 మంది అర్హత సాధించారు. కాగా అందులో ఇప్పటికే దాదాపు 90 శాతానికి పైగా అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా పరీక్ష కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ద్వారా 563 పోస్టులను టీజీపీఎస్సీ భర్తీ చేయనుంది. ఇందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటికే కొన్ని గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. తొలిరోజు తీసుకెళ్లిన హాల్ టిక్కెట్‌నే మిగిలిన ఆరు పరీక్షలకు తీసుకెళ్లాలని, అలా కాదని రోజుకో కొత్త హాల్ టిక్కెట్‌తో వెళ్తే ఇన్విజిలేటర్లు అనుమతించబోరని స్పష్టంగా పేర్కొంది. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ప్రతిపరీక్ష రోజు హాల్ టిక్కెట్‌పై తప్పనిసరిగా సంతకం చేయాలని టీజీపీఎస్సీ సూచించింది. అలాగే గ్రూప్‌ 1 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు హాల్‌ టికెట్లను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించింది. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టిక్కెట్‌తో పాటు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్, బ్లాక్‌ లేదా బ్లూ బాల్ పాయింట్ కలిగి ఉండాలని పేర్కొంది. ఇదిలా ఉండగా గ్రూప్‌-1 సర్వీస్ ఉద్యోగాలకు ఈ ఏడాది జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. జూలై 7న ఫలితాలు విడుదలయ్యాయి.


Similar News