నత్త నడకన ఏకేబీఆర్ లిఫ్ట్ పనులు

పిఏ పల్లి మండలంలో (ఏ.కే.బి.ర్) అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్, నంబాపురం లిఫ్ట్ పనులు మందకోడిగా సాగుతున్నాయి.

Update: 2023-04-08 04:56 GMT

దిశ: పి.ఏ.పల్లి : పిఏ పల్లి మండలంలో (ఏ.కే.బి.ర్) అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్, నంబాపురం లిఫ్ట్ పనులు మందకోడిగా సాగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్ణాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఒకటైన ఏ కే బి ఆర్ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్లక్ష్యానికి గురయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బీడు భూములను ప్రాజెక్టు నీటి ద్వారా పంట పొలాలు సస్యశ్యామలంగా ఉండటానికి మంజూరు చేసిన లిఫ్ట్ పనులు కాంట్రాక్టర్ల నిరక్ష్యంతో మందకోడిగా సాగుతున్నాయానే విమర్శలు వినిపిస్తున్నాయి. టెండర్ దక్కించుకున్న మెగా కంపెనీ సబ్ కాంట్రాక్టు‌కు వేరే కంపెనీకి అప్పజెప్పడంతోనే ఇలా నిర్లక్ష్యంగా పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఏకెబిఆర్ లిఫ్ట్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లో రూ.100 కోట్లను మంజూరు చేస్తూ పి.ఏ.పల్లి నుండి పైపుల ద్వారా చిల్కమర్రి వరకు నీటిని తీసుకువచ్చి అక్కడి నుండి పి.ఏ.పల్లి, గుర్రంపోడు మండలాలలోని చెరువులు నింపి, ఆ తర్వాత రైతులు పంట పొలాల కోసం నీటిని వాడుకుంటారు. రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు రైతుల నుండి కనీసం భూ సేకరణ కూడా చేపట్టలేదు.

ఇప్పటి వరకు హిటాచి మిషన్ ద్వారా బావి పనులు మాత్రమే పూర్తి చేశారు. అక్కంపల్లి ప్రాజెక్టు నీరు దగ్గరలో ఉండడంతో నీరు బావిలోకి ఊరుతుండడంతో మోటర్ల ద్వారా నీటిని తోడుతున్నారు. ప్రాజెక్టు పనుల కోసం బావిలో నీటిని తోడాలన్నా, ఇనుప రాడ్లు కట్టింగ్ చేయాలన్న నిరంతరం విద్యుత్ అవసరం. కానీ కాంట్రాక్టర్ విద్యుత్ కోసం ఏలాంటి ఏర్పాట్లు చేయలేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. దగ్గరలో ఉన్న రైతుల ట్రాన్స్ఫర్మర్ నుండి విద్యుత్ వాడుకుంటూ తాత్కాలికంగా చేతులు దులుపుకుంటున్నారు. ప్రాజెక్టు పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలున్నాయి.

రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులలో నాణ్యత పాటించాలని రైతులు కోరుతున్నారు. కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలతో పనులు పూర్తిచేసి రైతులకు సాగునీరు, తాగునీరు అందించేలా స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఏకేబిఆర్ సంబంధించిన బ్యాలెన్స్ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులు పనులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని రైతులు అంటున్నారు. ఇప్పటికైయినా ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రైతులు కోరుతున్నారు. 

Tags:    

Similar News