వికలాంగులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి..ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి జ్యోతి

వికలాంగులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2023-06-18 17:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వికలాంగులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకే కుటుంబంలో ఎక్కువమంది చిన్న చిన్న ఇండ్లలో ఉంటున్నారని, పెళ్లయిన కుటుంబాలు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. నియోజకవర్గ కేంద్రాలలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిన పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ఇండ్ల స్థలాల పంపిణీ జీవోను రద్దు చేసిందని, దానిని వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వికలాంగులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇండ్ల స్థలాల సాధన కోసం జూలై 3న జరిగే కలెక్టరేట్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు.

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి కె వెంకట్, ఏం అడివయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. సదరం క్యాంపుల నిర్వహణ అస్తవ్యస్తం గా తయారైందనీ అన్నారు. క్యాంపులు జరిగి నెలలు గడుస్తున్న సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు. వికలాంగుల సామాజిక భద్రత కోసం జూన్ 20 నుంచి జూలై 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహించి జూలై 10న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమానికి వికలాంగులను సన్నద్ధం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల ఉద్యోగ నియామకాల రోస్టర్ పాయింట్లు పది లోపు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు అర్ వెంకటేష్, సాయమ్మ, జే రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కశప్పా, వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News