ఏఐసీసీ స్థాయిలో కసరత్తు.. PCC చీఫ్ పోస్టుకు ‘ఫోర్ టర్మ్స్’ ఫార్ములా!

పీసీసీ అధ్యక్ష పదవి ఎంపికకు గతంలో అనుసరించిన పాలసీని ఫాలో కావాలని ఏఐసీసీ భావిస్తున్నది.

Update: 2024-07-01 02:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పీసీసీ అధ్యక్ష పదవి ఎంపికకు గతంలో అనుసరించిన పాలసీని ఫాలో కావాలని ఏఐసీసీ భావిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004-2014 పీరియడ్‌ను పరిగణనలోకి తీసుకొని.. ఆ టైమ్‌లో అమలు చేసిన ఈక్వేషన్స్‌నే ఈ సారి కూడా అవలంభించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2004-2005 వరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన డీ శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా పని చేయగా.. ఈ టర్మ్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం‌గా పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు బీసీ కమ్యూనిటీకి చెందిన కే.కేశవరావు పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా..ఈ పీరియడ్‌లోనూ వైఎస్ సీఎంగా ఉన్నారు. 2008 నుంచి 2011 మళ్లీ డీ శ్రీనివాస్‌కు పీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. అప్పుడు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, రోశయ్యలు సీఎంగా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ పీసీసీ అధ్యక్షుడిగా పని చేయగా..ఈ టర్మ్‌లో సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పవర్‌లో ఉన్నప్పుడు సీఎంగా రెడ్డి సామాజిక వర్గం నేతలు ఉండగా, పీసీసీ అధ్యక్షుడిగా బీసీలకు అవకాశం ఇచ్చారు. క్యాస్ట్ ఈక్వేషన్స్‌ను బ్యాలెన్స్ చేసేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పార్టీ లీడర్లు చెప్తున్నారు.

ఈ టైమ్ కీలకం

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 2004-2013 వరకు ప్రజల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. ప్రభుత్వ పథకాలు, వైఎస్ ప్రభావం, వివిధ నేతల పనితీరు వంటివన్నీ కలిసి వచ్చాయి. యూపీఏ 1, యూపీఏ 2 టర్మ్‌లలో తెలంగాణ ఉద్యమం క్రియాశీలకంగా ఉన్నప్పటికీ, ప్రజల నుంచి కాంగ్రెస్‌కు ఆదరణ తగ్గలేదు. దీంతో ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలను హైకమాండ్ తెరమీదకు తెస్తున్నది. ఇప్పుడున్న రేవంత్‌రెడ్డి సర్కారు కూడా పదేండ్లు పవర్‌లో ఉండాలని భావిస్తున్నది. దీనిలో భాగంగానే గతంలో సక్సెస్‌ను అందించిన ఆలోచనలు, విధానాలు, సూత్రాలను ఇప్పుడూ ఇంప్లిమెంట్ చేయాలనేది ఏఐసీసీ భావన. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక వేగంగా జరుగుతున్న వేళ ఈ అనవాయితీ తెర మీదకు వచ్చింది. దీని వల్ల నేతలందరూ సంతృప్తి చెందుతారని పార్టీ వర్గాల్లో టాక్. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ను ప్రకటించే చాన్స్ ఉన్నదని పార్టీ‌లో జోరుగా చర్చ జరుగుతున్నది.

ప్రయత్నిస్తున్న పలువురు లీడర్లు

పీసీసీ చీఫ్ పోస్టు బీసీకి కన్ఫామ్ చేస్తే, గౌడ సామాజిక వర్గానికి దక్కే అవకాశం ఎక్కువగా ఉందనే చర్చ జరుగుతున్నది. దీంతో పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ‌గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. ఏఐసీసీ స్థాయిలోని తన పరిచయాలతో పావులు కదుపుతున్నారు. దీంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు టాక్. ఇక ప్రభుత్వంలో సరైన ప్రాతనిధ్యం లేని కులాలను కూడా పీసీసీ చీఫ్ పోస్టు కోసం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నది. ప్రస్తుత ప్రభుత్వంలో ఎస్టీ కులాల్లోని ఆదివాసీ వర్గానికి మంత్రి పదవి ఉండగా, లంబాడాలకు అవకాశం రాలేదు. లంబాడా వర్గానికి పార్టీలో హయ్యర్ పోస్టు ఇవ్వాలనే ఒక ప్రపోజల్ కూడా ఉన్నది. దీంతో ప్రస్తుత ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పేరును కూడా పీసీసీ చీఫ్ పోస్టుకు పరిశీలిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.


Similar News