కొందరికి రుణమాఫీ జరగని మాట వాస్తవమే.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
రుణమాఫీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 41 లక్షల 78 వేల 892 మంది రైతులు రుణాలు తీసుకున్నారని బ్యాంకులు తమకు నివేదిక అందించాయి. ఆ రైతులు అందరి పేరు మీద మొత్తం రూ.31 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతులకు ఎక్కువగా రూ.2 లక్షల లోపు రుణాలే ఉన్నాయని తెలిపారు. అందుకే ముందుగా వారికే రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మిగతా వారికి కూడా దశలవారీగా చేస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ హయాంలో చేసిన లక్ష రూపాయల రుణమాఫీనే దశల వారీగా చేస్తామని దగా చేశారు. రైతులు ఐదేళ్లు ఎదురుచూస్తే.. తీరా ఎన్నికల ముంగిట చేశారు. అది కూడా అందరికీ కాకుండా కొందరికే రుణమాఫీ చేశారని విమర్శించారు.
రూ.11 వేల కోట్లు కూడా ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచారని మండిపడ్డారు. తాము రుణమాఫీపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని అన్నారు. బ్యాంకులు, అధికారులు ఏవైనా తప్పులు చేస్తే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తక్షణమే తప్పులు సరిదిద్ది రుణమాఫీ వర్తింపజేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రైతులు వ్యవసాయ అధికారులకు సవరణ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నా.. లేకున్నా రైతులకు రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. అధికారులు ఇంటింటికీ వెళ్లి కుటుంబాన్ని నిర్ధారించి జాబితా రూపొందించాలని ఆదేశించారు. 41.78 లక్షల మంది రైతుల వివరాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. బ్యాంకుల్లో జరిగిన చిన్న చిన్న పొరపాటు వల్ల కొంతమందికి రుణమాఫీ కాలేదు. అలా రుణమాఫీ కాని రైతుల వివరాలు తాము సేకరించాం. అందుకే తప్పులు సరిదిద్ది తక్షణమే మాఫీ వర్తింపజేయాలని ఆదేశించినట్లు తెలిపారు.