పొలిటికల్ పొంగల్.. పండుగ తర్వాత వేడెక్కనున్న వరంగల్ రాజకీయాలు
వరంగల్‌లో పొలిటికల్ పొంగల్ ఆరంభంకానుంది. సంక్రాంతి నుంచే సరికొత్త ఎత్తుగడలతో వరంగల్ జిల్లా రాజకీయం ముందుకెళ్లబోతోంది.
దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్‌లో పొలిటికల్ పొంగల్ ఆరంభంకానుంది. సంక్రాంతి నుంచే సరికొత్త ఎత్తుగడలతో వరంగల్ జిల్లా రాజకీయం ముందుకెళ్లబోతోంది. సాధారణ ఎన్నికలకు 10 నెలల గడువున్నా ముందస్తు పల్లవి వినిపిస్తున్న వేళ అధికార పార్టీ సహా ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అలర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న మూడు పార్టీల నేతలు రాజకీయ రణభేరిని మోగించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్‌లో సిట్టింగ్‌లకే సీట్లని సీఎం స్వయంగా ప్రకటించినప్పటికీ ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలు వీడడం లేదు. ఆత్మీయ పలకరింపుల పేరిట దూసుకెళ్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే స్వపక్షంలో అసంతృప్తులను కలుపుకెళ్లడం, అసమ్మతిని మట్టుబెట్టడం, విపక్షాలకు చెక్ పెట్టడం అనేది జనంలోకి వెళ్లడంతోనే సాధ్యమవుతుందని భావిస్తున్నారంట.
అవసరమైతే పల్లెనిద్రలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్లాన్..
ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవడం, ప్రజా సమస్యలను కనుగోని వెంటనే పరిష్కరించడం, ఈ నాలుగేళ్ల కాలంలో నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, భవిష్యత్ పనులపై హామీలివ్వడం, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో వేగం పెంచడం, జనంలో ఉంటూ ప్రజల్లో నెలకొన్న రాజకీయ అభిప్రాయాన్ని తెలుసుకుంటూ మార్పునకు అనుగుణంగా చర్యలను ఆరంభించడం వంటి అనేకానేక రాజకీయ పనుల్లో బిజిబిజీ కానున్నట్లుగా తెలుస్తోంది. అవసరమైతే పల్లెనిద్రలు కూడా చేయాలని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు ఈ తరహా ఆలోచనల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వ్యతిరేకత ఉన్నదనే ప్రచారం నేపథ్యంలో ఇప్పటికే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో మమేకమవుతున్నారు. ఆ మాటకొస్తే పార్టీ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ రూరల్ జడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే సతీమణి సైతం జనంలో ఉంటూ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లు సైతం ప్రజాయాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.
పాదయాత్రలకు కాంగ్రెస్ నేతల ప్లాన్..!
ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధమవడం మంచిదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే నర్సంపేట టికెట్ ఆశిస్తున్న దొంతి మాధవరెడ్డి, జనగామ నియోజకవర్గంలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, డోర్నకల్ నియోజకవర్గంలో మాలోతు నెహ్రూనాయక్, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇందిర, పరకాలలో ఇనుగాల వెంకట్రామిరెడ్డి పాదయాత్రలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా సమాచారం. అలాగే వరంగల్ పశ్చిమలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ తూర్పులో కొండా సురేఖలు గడపగడపకు కార్యక్రమం పేరిట ఆక్టివ్ కానున్నట్లుగా వారివారి అనుచరులు పేర్కొంటున్నారు. నెలాఖరులోగాని, ఫిబ్రవరి మొదటి వారంలోగాని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్‌లో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌లో కదనోత్సహం రగిల్చేందుకు స్పష్టతతో కూడిన చర్యలుంటాయని చెబుతున్నారు.
బలం చూపేందుకు బీజేపీ రెఢీ..!
రాష్ట్ర వ్యాప్తంగా తమకున్న వేవ్‌ను వరంగల్‌లో చూపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఊపు మొదలవుతుందని ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు దిశకు వెల్లడించారు. వీక్లీల వారీగా కార్యక్రమాల నిర్వహణపై పార్టీ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలోనూ కొన్ని కీలక పదవుల్లో నియామకాలు, మార్పులు, చేర్పలుంటాయని సమాచారం. నియోజకవర్గాల టికెట్లపైనా విస్పష్టమైన వైఖరి సైతం వెల్లడవుతుందని పేర్కొనడం గమనార్హం. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ స్థాయి నేతలతో పర్యటనలకు శ్రీకారం చుట్టునున్నారు. వరంగల్ పశ్చిమలో టికెట్ రేసులో ఉన్న రాకేష్ రెడ్డి గడపగడపకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మార్నింగ్ వాక్ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఆయన స్పీడ్ పెంచనున్నట్లు సమాచారం. వరంగల్ తూర్పు నుంచి టికెట్ ఆశిస్తున్న ప్రదీప్‌రావు ఇప్పటికే చాలా వేగంగా జనంలోకి వెళ్తున్నారు. పరకాల నుంచి టికెట్ ఆశిస్తున్న డాక్టర్ కాళీ ప్రసాద్ రావుతో పాటు, జనగామలోనూ పార్టీలోకి కొత్త వారికి చేరికలుంటాయని సమాచారం.