మాట్లాడే ముందు కొంత ఆలోచించాలి.. MP కోమటిరెడ్డికి అద్దంకి కౌంటర్
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని.. ఆ తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్‌తో కలవక తప్పదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని.. ఆ తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్‌తో కలవక తప్పదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ 60 సీట్లకు మించి గెలవదని.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను టీ-కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. కోమటిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తాయని అన్నారు.
సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి ప్రతిసారి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై దృష్టి పెట్టాలని అద్దంకి కోరారు. కోమటిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు సరికాదని అన్నారు. మాట్లాడే ముందు కోమటిరెడ్డి కొంత ఆలోచించి మాట్లాడాలని సూచించారు. ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రియాక్ట్ అయ్యారు.
రాష్ట్రంలో ఎన్నికల వేళ ఎంపీ కోమటిరెడ్డి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. నేతలు ఇలాంటి మాటలు మాట్లాడితే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. కీలక సమయంలో పార్టీ కేడర్‌ను కన్ఫ్యూజ్ చేయొద్దని.. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేసేందుకే ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తప్పులుంటే సరిదిద్దుకుని ముందుకెళ్లాలని అంతేకానీ, ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు.