ఆదిత్యానాథ్ దాస్‌ను ఆ పదవి నుంచి తొలగించాలి.. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి డిమాండ్

ఆదిత్యానాథ్ దాస్‌ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు

Update: 2024-06-08 11:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆదిత్యానాథ్ దాస్‌ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆదేశిస్తున్నాడు.. శిష్యుడు రేవంత్ పాటిస్తున్నాడని అన్నాడు. ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలయిందనడానికి ఈ నియామకమే నిదర్శనమని తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు రుణపడి ఉంటాడా? పదవిని లాగేస్తారన్న భయంతో చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటాడా? అని ప్రశ్నించాడు.

నాడు జలయజ్ఞం ప్రాజెక్టుల నుంచి నిన్న పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యాదాస్ ది కీలకపాత్ర అని పేర్కొన్నారు. ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి ఎందుకు కట్టబెట్టారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరాడు. తెలంగాణ ప్రాజెక్టుల వ్యతిరేకిగా ముద్రపడ్డ వ్యక్తిని ఏ ప్రయోజనాల కోసం ఈ పదవిలో కూర్చోబెట్టారని మండిపడ్డాడు. వ్యక్తిగతంగా ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన పట్ల మాకు ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. కానీ ఆంధ్రకు కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించడంలో ఆయనది కీలకపాత్ర ఉందని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గత పదేళ్లుగా ఆయన ఏపీ తరపున కొట్లాడిన వ్యక్తి అని అన్నాడు.

కేఆర్ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనక కాంగ్రెస్ ఆలోచన ఏంటి? అని ప్రశ్నించాడు. పోతిరెడ్డిపాడు, దుమ్ముగూడెం, రాయలసీమ ఎత్తిపోతల పథకాలతో తెలంగాణ నీటిని తరలించడంలోనూ ఆదిత్యాదాస్ దే కీలకపాత్ర ఉందని, అలాంటి వ్యక్తి తెలంగాణ ప్రయోజనాల కోసం కృషిచేస్తాడా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలంగాణ ప్రాజెక్టులు, జల వనరుల మీద అపారమైన అనుభవం, అవగాహన ఉన్న ఎందరో జల నిపుణులు ఉన్నారని, వారిని పక్కనపెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎంచుకోవడం వెనక కారణాలేంటి? అని అడిగారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉందని వెంటనే ఆధిత్యానాథ్ దాస్‌ను నీటిపారుదల సలహాదారు పదవి నుంచి తొలగించాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరాడు.


Similar News