BHAINSA AMC MARKET :బైంసా ఏఎంసీ చైర్మన్ పదవి ఎవరికో..?

బైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గం గత సంవత్సరం డిసెంబర్ 18న రద్దయింది. తాజాగా నూతన చైర్మన్ పదవి ఈ సారి ఎస్టీలకు ఇవ్వాలని రిజర్వ్ అయింది.

Update: 2023-01-31 08:02 GMT

దిశ, భైంసా: బైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గం గత సంవత్సరం డిసెంబర్ 18న రద్దయింది. తాజాగా నూతన చైర్మన్ పదవి ఈ సారి ఎస్టీలకు ఇవ్వాలని రిజర్వ్ అయింది. ముధోల్ తాలుకాలో 7 మండలాలు ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుబీర్ మండలం అతి పెద్దది. ఈ నేపథ్యంలోనే అక్కడే వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉంది.

మిగతా 6 మండలాలలో కుంటాల మండలం సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలోకి రాగా, లోకేశ్వరం మండలం నిర్మల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలోకి వస్తుంది. ఇంకా మిగిలి ఉన్న బైంసా,ముధోల్, తానూర్,బాసర మండలాలు బైంసా వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలోకి వస్తాయి.

అయితే తాజాగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్టీలకు రిజర్వేషన్ కావడంతో ఈ నాలుగు మండలాలలో ఉన్న ఎస్టీ బలమైన నాయకులు సైతం చైర్మన్ పదవి పై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భైంసా,తానూరు మండలాలకు సంబంధించి అభ్యర్థులు చైర్మన్లు కాగా ఈసారి బాసర, ముధోల్ మండలాల పరిధిలో నుండి ఎస్టి బలమైన అభ్యర్థులను చైర్మన్‌గా ఎన్నుకునే అవకాశం మెండుగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు, ప్రజలనుకుంటున్నారు.

కాగా వైస్ చైర్మన్ పదవిని పట్టణ వాసులకు ఇవ్వాలనే డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. చైర్మన్ గా లోకేశ్వరం మండలానికి చెందిన రాజేష్ బాబు, ముధోల్ మండలానికి చెందిన నరేందర్ రాథోడ్ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది.

బైంసా వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో ముధోల్ మండలం ఉండడంతో అవకాశాలు మెండుగా ముధోల్ మండలానికే ఉన్నట్లు తెలుస్తోంది. ముధోల్ మేజర్ గ్రామపంచాయతీ కాగా గత కొన్ని సంవత్సరాల నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలనీ ప్రతిపాదనలు ఉన్న ఇప్పటికీ నోచుకోలేదు.

కనీసం ఆ మండలానికి చెందినటువంటి అభ్యర్థికైన చైర్మన్ పదవిని కట్టబెడితే ఆ మండల కేంద్రానికి కనీస గౌరవం దక్కుతుందని ఆ మండల కొందరు ప్రజలు అవకాశం వ్యక్తం చేస్తున్నారు.

రేసులో ఉన్నది ఎవరు?

ముధోల్ మండలం చింతకుంట తండాకి చెందినటువంటి నరేందర్ రాథోడ్,లోకేశ్వరం మండలం చెందిన రాజేష్ బాబు ప్రస్తుతం ఈ రెండు పేర్లు బై0సా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎక్కువగా వినిపిస్తున్నాయి. నరేందర్ రాథోడ్ గతంలో సర్పంచ్, కాంగ్రెస్ పీరియడ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్టీ సెల్ కన్వీనర్ గా, బంజారా సేవా సంఘం జిల్లా నాయకులుగా, రైతు సమన్వయ సమితి సభ్యులుగా సైతం బాధ్యతలు చేసిన అనుభవం ఉంది.

రాజేష్ బాబు జిల్లా ఎస్టీ సెల్ నాయకులు గా, గతంలో వారి ఇంటి వారు సైతం సర్పంచ్‌గా చేశారు.ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులుగా కొనసాగుతున్నారు.ఏదేమైనా బైంసా మార్కెట్ యార్డ్ పరిధిలోపలలో గల మండలాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వైస్ చైర్మన్ బీసీలకు కట్టే అవకాశం?

ఈ నేపద్యంలో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవిని పట్టణానికి చెందిన వ్యక్తికే కేటాయించే అవకాశం మెండుగా ఉంది.గత పాలకవర్గంలో వైస్ చైర్మన్ పదవిని ముస్లిం మైనారిటీవర్గానికి కేటాయించగా, ఈ సారి జనాభాలో అత్యధికంగా ఉన్న మున్నూరుకాపులకు దక్కే అవకాశం ఉందని ప్రజలనుకుంటున్నారు.

ఇది ఇలా గుంటే పట్టణానికి చెందిన బిఅర్ఎస్ యువనాయకుడు మున్నూరుకాపు సంఘం తాలుకా కార్యదర్శి తోటరాముకు వైస్ చైర్మన్ పదవి వరించే అవకాశం ఉందని పరిశీలికులు భావిస్తున్నారు.గతంలో బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా చేసిన అనుభవం కూడా ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడి మార్కెట్ చైర్మన్ పదవి ఎస్టీలకు రిజర్వ్ కావడం వల్ల వైస్ చైర్మన్ పదవిని తోటరాముకు కేటాయిస్తే పట్టణానికి ప్రాతినిధ్యం కల్పించినట్లు ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆశీసులు ఎవరికి ఉంటే వారికే చైర్మన్,వైస్ చైర్మన్ పదవి దక్కుతుందని కాదనలేని సత్యం.

పలుచోట్ల నియమకాలు జరిగిన బైంసాలోనే ఎందుకు ఆగింది

ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లలో నూతన చైర్మన్,వైస్ చైర్మన్ పాలకవర్గం ఎన్నిక కాగా...బైంసా వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పాలకవర్గం రద్దై 45 రోజులైనా నూతన పాలకవర్గం ఎన్నిక కాలేదు. దీంతో మార్కెట్‌లో అధికారుల మీదుగానే వ్యవహారాలు నడుస్తున్నాయి. నియామక ప్రక్రియకు లేటు కాకుండా తొందర్లోనే పూర్తయితే బాగుంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

Tags:    

Similar News