కాళేశ్వరం నీళ్లు లేకుండానే కోటి 53 లక్షల టన్నుల వడ్లు పండించాం
కాలేశ్వరం ప్రాజెక్టు నుండి లీటర్ నీటిని తీసుకోకుండానే కోటి 53 లక్షల టన్నుల వడ్లను పండించామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు.
దిశ, మంచిర్యాల : కాలేశ్వరం ప్రాజెక్టు నుండి లీటర్ నీటిని తీసుకోకుండానే కోటి 53 లక్షల టన్నుల వడ్లను పండించామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎంతో నష్టపోయారన్నారు. ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారని, బీఆర్ఎస్ నేతలు పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను పెంచినట్లు తెలిపారు.
రెండు లక్షల రూపాయల రుణమాఫీ 89 శాతం పూర్తి అయిందన్నారు. కొంతమంది రైతుల ధ్రువపత్రాలు సరిగ్గా లేకపోవడంతో రుణమాఫీ కాలేదని తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో రుణమాఫీ రైతులకు కల్పించే విధంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 54 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి రైతులను ఆదుకున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పటివరకు 62 వేల కోట్ల రూపాయల వడ్డీ చెల్లించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వెన్నంటే ఉంటుందని తెలిపారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1505 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి తప్పక చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.