వామ్మో పులి.. వణుకుతున్న కొమురం భీం జిల్లా...
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎనిమిది పులులు సంచరిస్తున్నాయన్న సమాచారం ఆ జిల్లా ప్రజలను కునుకు లేకుండా చేస్తున్నది.
దిశ ప్రతినిధి, నిర్మల్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎనిమిది పులులు సంచరిస్తున్నాయన్న సమాచారం ఆ జిల్లా ప్రజలను కునుకు లేకుండా చేస్తున్నది. మూడు నెలలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా సంచరించిన పులులు తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే మకాం వేసినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రాష్ట్ర అటవీ శాఖ పులుల సంచారం నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని కాగజ్నగర్ కారిడార్ గా నామకరణం చేశారు.
నాలుగు ఆడ, రెండు మగ పులుల వలస..
అటవీ జంతువుల సంరక్షణ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ అడవులు పూర్తి సేఫ్ జోన్ గా అటవీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కవ్వాల్ అభయారణ్యం ఏర్పాటు చేసిన జాతీయ అటవీశాఖ ఆ ప్రాంతంలో పులుల సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నది. మరోవైపు పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి భారీగా పులుల వలస పెరిగింది. మహారాష్ట్రలో ఉన్న తడోబా టైగర్ రిజర్వ్, తిప్పేశ్వర్ టైగర్ రిజర్వుల నుంచి పులుల వలస పెరిగింది. అటవీ అధికారుల నిర్ధారణ మేరకు నాలుగు ఆడ పులులు, రెండు మగ పులులు ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు. అయితే అటవీ అధికారులు విస్తృత తనిఖీల నేపథ్యంలో ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతంలో సంచరించిన పులులు అన్ని కొమరం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించాయి. మొత్తంగా ఎనిమిది పులులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ ధ్రువీకరించింది.
రైతుల ఆందోళన... ప్రజల్లో భయం...
మొన్నటి దాకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పులులు మాత్రమే సంచారం చేస్తున్నాయన్న సమాచారం ఉండేది అయితే తాజాగా 4 ఆడ, రెండు మగ పులులు మహారాష్ట్ర ప్రాంతానికి వలస రావడంతో పులుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. గతంలోనే బాలికను కబలించిన పులి పలుచోట్ల దాడులు కూడా చేసింది. ఇద్దరు వ్యక్తులను దారుణంగా గాయపరిచింది. తాజాగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏకంగా ఎనిమిది పులులు సంచరించడం, మరోవైపు అటవీ శాఖ కాగజ్ నగర్ ప్రాంతాన్ని పులుల కారిడార్ గా ప్రకటించడంతో ఈ ప్రాంతంలో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.