మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతదేహంతో ఆందోళన

లోకేశ్వరం మండల కేంద్రంలోని ఒక వైన్ షాపులో మంగళవారం మద్యం సేవించి ఒక వ్యక్తి మృతి చెందగా, మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ గ్రామస్తులు , బంధువులు బుధవారం మృతదేహంతో ఆ వైన్ షాప్ ముందు ఆందోళనకు దిగారు.

Update: 2024-03-27 10:32 GMT

దిశ, లోకేశ్వరం: లోకేశ్వరం మండల కేంద్రంలోని ఒక వైన్ షాపులో మంగళవారం మద్యం సేవించి ఒక వ్యక్తి మృతి చెందగా, మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ గ్రామస్తులు , బంధువులు బుధవారం మృతదేహంతో ఆ వైన్ షాప్ ముందు ఆందోళనకు దిగారు. ఆ సమయంలోనే వైన్ షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ ఎందుకు చేశారని బంధువులు నిలదీశారు. మృతుడు పోతురాజు ప్రశాంత్ మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో మద్యం సేవించడానికి ఆ వైన్ షాపులోకి వెళ్ళాడు. మద్యం సేవిస్తూ దాదాపు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు బంధువుల ఆరోపణ. కాగా ఆ సమయంలో మృతుని ముక్కులో నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయని, మృతి పై అనుమానాలు ఉండడంతో సీసీటీవీ పుటేజీ అందించాలని, కుటుంబ సభ్యులు కోరగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సీసీటీవీ పుటేజీ వివరాలు లేవని, పోలీసులతో పాటు వైన్ షాప్ సిబ్బంది చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు.

ఆర్థోపెడిక్ వైద్యునిచే పోస్టుమార్టం చేయించడం పై అనుమానాలు..

బుధవారం ఉదయం భైంసా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా ఆర్థోపెడిక్ వైద్యునిచే పోస్టుమార్టం కార్యక్రమం పూర్తి చేయడం కూడా అనుమానాలకు బలం చేకూర్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతి పై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బయటకు వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని, కుటుంబ పెద్ద మరణించినందున ఆదుకోవాలని వారు భీష్మించుకు కూర్చున్నారు.




 


Similar News