కూలీలకు పూర్తి స్థాయిలో పనులు కల్పించాలి
ఉపాధి హామీ కూలీలకు పూర్తి స్థాయిలో పనులు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు.
దిశ, ఆసిఫాబాద్: ఉపాధి హామీ కూలీలకు పూర్తి స్థాయిలో పనులు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్, డీఆర్డీవో సురేందర్, పంచాయతీ రాజ్ ఈఈ ప్రభాకర్‌లతో కలిసి ఎంపీడీవోలు, ఏపీఎంలు, సీడీపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలన్నారు. పనుల్లో కూలీల హాజరు శాతాన్ని పెంచాలని, దినసరి వేతనం పెంపొందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనులను నిర్దేశించిన సమయంలోపు పని చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ వాటి నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వర్షపు నీటి సంరక్షణ యూనిట్లను ఏర్పాటు చేసి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.