ప్రజా పాలన కళాయాత్ర ప్రారంభం.. కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను మరింత ప్రజలకు చేరవేసేందుకు చేపట్టే ప్రజాపాలన కళాయాత్ర జిల్లాలో మంగళవారం ప్రారంభమైంది.
దిశ, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను మరింత ప్రజలకు చేరవేసేందుకు చేపట్టే ప్రజాపాలన కళాయాత్ర జిల్లాలో మంగళవారం ప్రారంభమైంది. ఈ యాత్రను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామల దేవితో కలిసి తన క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారి తిరుమల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో ప్రజా విజయోత్సవాలు ఈ నెల 19 వ తేది నుంచి డిసెంబర్ 07 వరకు జిల్లాలోని మండలాల్లోని ఆయా గ్రామాల్లో, మున్సిపాలిటీలలో కొనసాగుతుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి, ఇందిరా మహిళా శక్తి, గృహ జ్యోతి, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల పై ప్రచారం చేయనున్నారని తెలిపారు. ప్రతి మండలం నుంచి మూడు గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్వో వెంకటేశ్వర్లు, టూరిజం ఆఫీసర్ పార్థసారథి, రవీందర్, అశోక్, తెలంగాణ సాంస్కృతిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు.