‘లాభం వాటా.. భవిష్యత్తు బాట’.. సింగరేణి క్షేత్రంలో కొత్త వెలుగులు

సింగరేణి లాభాల తర్వాత తీసుకుంటున్న చర్యలు ఆ కంపెనీ భవిష్యత్తుకు బాటలు వేసేలా కనిపిస్తున్నాయి.

Update: 2024-09-24 02:23 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్: సింగరేణి లాభాల తర్వాత తీసుకుంటున్న చర్యలు ఆ కంపెనీ భవిష్యత్తుకు బాటలు వేసేలా కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి పరిరక్షణతో పాటు కార్మిక సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సింగరేణికి వచ్చిన లాభాల్లో 33% కార్మికులకు బోనస్ గా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా లాభాలను గత సర్కారుకు భిన్నంగా మళ్ళీ కార్మిక సంక్షేమం కోసమే ఖర్చు చేయడంలో భాగంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి విస్తరణకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కొత్త పరిణామం.

లాభాల వాటాతో భవిష్యత్తు బాట..

సింగరేణి యాజమాన్యానికి ఈ ఏడాది 4701 కోట్ల లాభం వచ్చింది. ఇందులో సింగరేణికి అండదండగా ఉన్న కార్మిక సంక్షేమం కోసం వారి కుటుంబాలకు దసరా బోనస్ కింద 33% వాటాను ఆ కుటుంబాలకు ప్రభుత్వం అందజేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ప్రతి కార్మిక కుటుంబానికి 1.90 లక్షల లాభం చేకూరనుంది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈ లాభాల వాటా నుంచి నగదు చెల్లించనున్నారు. రేవంత్ సర్కారు సింగరేణి కార్మికుల కోసం భవిష్యత్తులో వారికి భరోసా ఇచ్చే దిశగా బొగ్గు ఉత్పత్తి విస్తరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన బొగ్గు బ్లాకుల వ్యవహారంలో ప్రైవేటు కంపెనీ దక్కించుకున్న మందమర్రి సమీపంలోని శ్రావణ్ పల్లి బ్లాక్ ను సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇందుకు పూర్తి స్థాయిలో రాష్ట్ర సర్కారు నిర్ణయానికి అనుకూల నిర్ణయం వస్తుందని చెబుతున్నారు. కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న తాండూరు మండలం గోలేటి ఓపెన్ కాస్ట్ మైనింగ్ పనులు కూడా ఈ లాభాల వాటా నుంచి ప్రారంభించనున్నారు. మరోవైపు నిధుల లేమితో నిలిచిపోయిన జైపూర్ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సైతం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది పూర్తయితే సింగరేణి యాజమాన్యానికి భారీగా నిధులు సమకూరి కార్మికులకు ఆర్థికంగా ఒక బలోపేత వనరుగా మారే అవకాశాలు ఉన్నాయని కార్మికుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న చెన్నూరు అండర్ గ్రౌండ్ మైనింగ్ వ్యవహారం కూడా తెరపైకి వస్తున్నది. లాభాల వాటా నుంచే దీన్ని కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

భారీగా కార్మికులకు లాభం.. కొత్తగా 5000 మందికి ఛాన్స్

సింగరేణి లాభాల వాటా నుంచి కొత్తగా ప్రారంభించనున్న నూతన ప్రాజెక్ట్‌ల ద్వారా సింగరేణి ప్రాంతంలో సుమారు 5000 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. 2400 మంది కార్మికులకు ప్రత్యక్షంగా, మరో 2700 మందికి అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉందని సీనియర్ సింగరేణి నేత ఒకరు అభిప్రాయపడ్డారు. అలాగే పరోక్షంగా వందలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు దక్కుతాయి.

గత ప్రభుత్వం సింగరేణి లాభాల వాటాను కార్మికులకు మిగతా డబ్బులను ఏం చేశారో తెలియదు. అనేక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను కార్మికులకు గతంలో ఎప్పుడూ లేని విధంగా 33% బోనస్ పెంచడంతోపాటు మిగతా లాభాలను కార్మిక కుటుంబాల కోసం సింగరేణి విస్తరణ కోసం ప్లాన్ చేస్తున్నది ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి కుటుంబాల పాలిట నిజంగా దేవుళ్లని చెప్పక తప్పదు.


Similar News