పీఎం జుఫ్లా, సీఎం హౌలా.. బూతులతో రెచ్చిపోయిన కేటీఆర్

అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని పీఎం నరేంద్ర మోడీ జుఫ్ల అయితే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి హౌలా అని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

Update: 2024-10-24 12:20 GMT

దిశ, ఆదిలాబాద్ :  అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని పీఎం నరేంద్ర మోడీ జుఫ్ల అయితే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి హౌలా అని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో 100 హామీలు ఇచ్చి ఆరు హామీలను కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చని కారణంగా ఆదిలాబాద్ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో రామన్నల పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుబంధు రైతు భరోసా తో పాటు రైతు రుణమాఫీ వంటి హామీలను వెంటనే నెరవేరుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి రైతులను ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోరుబాట కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరై సంఘీభావం తెలియజేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ పీఎం నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డిల పై ఘాటు విమర్శలు చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి పేద వాడి అకౌంట్లో రూ. 15 లక్షల వేస్తామని, జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయించిన ఇంతవరకు ధన్,ధన్ అంటూ డబ్బులు పడలేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఆ విధంగా ప్రజలను మోసం చేస్తే,100 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు హామీలను నెరవేర్చడానికే అపసోపాలు పడుతున్నారని ఆరోపించారు. ప్రజలనే కాకుండా రైతులను నిలువునా మోసం చేసిన రేవంత్ రెడ్డి పై 420 చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, ఈ ప్రభుత్వానికి తొందర్లోనే గుణపాఠం చెప్పక తప్పదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన చీటింగ్ హామీలపై ఆదిలాబాద్ నుంచి పోరుబాట ప్రారంభమైందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ.. అన్ని జిల్లాల్లో ప్రజలను, రైతులను చైతన్యం చేస్తామన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని కలెక్టర్, ఎస్పీ, సిఐలు, ఎస్ఐలు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలని, భవిష్యత్తులో అందరి పేర్లు రాసుకొని మిత్తి తో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. పద్ధతి ప్రకారం పని చేసుకుంటే అందరికీ మంచిదని వార్నింగ్ ఇచ్చారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమవడంతో పాటు రైతుబంధు, రైతు భరోసా, రుణమాఫీ చెల్లించడంలో, ఉచిత కరెంటు అందించడంలో తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. మహిళల ఖాతాలో రూ. 15000 ఎక్కడ పోయాయని, పెంచిన పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మరి ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి వంటి బడా నేతలని హెచ్చరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక లెక్కే కాదని, ఈ చిట్టి నాయుడు సంగతి త్వరలోనే తీరుస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక సిసిఐ విషయంలో గతంలో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన, ప్రస్తుతం ఎంపీ ఆ పార్టీ నేతనే ఉన్న సిసిఐ ని పున ప్రారంభించడంలో పూర్తిగా విఫలమయ్యారని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గురించి మాట్లాడే అవసరం లేదని,ఆయన ఎలాంటి వారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఇంకా మూడేళ్ల పాలన మాత్రమే ఉందని, రాష్ట్రం బాగుపడాలంటే శ్రీరామరక్ష లాంటి కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆరోజు తొందరలోనే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లా కాటన్ సాగుకు ఎంతో గుర్తింపు ఉందని, నాణ్యమైన పత్తిని పండించడంలో ఇక్కడి రైతులు ఎప్పుడు ముందుంటారన్న విషయం ఇతర రాష్ట్రాల్లోనూ తాను స్వయంగా గమనించానన్నారు. ప్రస్తుతం గుజరాత్ లో ఎన్నికలు జరుగుతున్నయని ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ రైతులకు పత్తి క్వింటాలుకు రూ.లు 8800 చెల్లిస్తున్నారని, అదేవిధంగా శుక్రవారం నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో పత్తి కొనుగోల్లలో స్థానిక పత్తికి సిసిఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూ.8800 మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులకు న్యాయం జరిగేంత వరకు బి ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు అడుగడుగున ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అవసరమైతే రైతుల కోసం తాను జైలుకెళ్లేందుకు భయపడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎంపీ బాల్క సుమన్,ఖాన పూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ ,బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Similar News