ఒక ఓటర్.. రెండు ఓట్లు.. ‘మహా’ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఓటర్లు
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి.
దిశ, ఆసిఫాబాద్ : మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాలైన అంతాపూర్, బోలాపటార్, పరందొలి, ముకుదంగూడ, శంకర్ లొద్ది, గౌరి, లెండిగూడ, కోట, ఇంద్రనగర్ తదితర వివాదాస్పద గ్రామాల ప్రజలు మహారాష్ట్రలోని రాజుర నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో బుధవారం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 15 గ్రామాల పరిధిలో సుమారు 4 వేల ఓటర్లు ఉండగా మహారాష్ట్ర ఎన్నికల అధికారులు 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ నియోజకవర్గం జరిగిన అసెంబ్లీ ఎన్నికకు.. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం తో పాటు మహారాష్ట్ర ఎంపీ స్థానం ఎన్నికల్లో ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఈ గ్రామాల ప్రజలు ఇప్పుడు నాలుగోసారి ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. సుప్రీం కోర్టులో కేసు నేపథ్యంలో రెండు రాష్ట్రాలు పాలించడంతో పాటు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కును వినియోగించే అరుదైన అవకాశం లభించింది. రెండు రాష్ట్రాల్లో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఇరు రాష్ట్రాల అధికారులు వచ్చి ఈ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.
ఈ గ్రామాల్లో అభివృద్ధి శూన్యం..
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు పొందుతున్న.. ఆ గ్రామాల అభివృద్ధి మాత్రం శూన్యమని చెప్పాలి. గ్రామాల్లో కనీసం మౌలిక వసతులు లేక అక్కడ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇరు రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చి హామీ ఇస్తున్నారే తప్ప తమను సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల పాలన ఏమో కానీ తమకు శాపంగా మారిందని వాపోయారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి తమ గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.