చన్నీటితో స్నానాలు... విద్యార్థుల అవస్థలు..
మండలంలోని సాంఘిక సంక్షేమ, ఐటీడీఏ పరిధిలోని ప్రభుత్వ ఆశ్రమ వసతి గృహాల విద్యార్థులకు చన్నీటితో స్నానాలు తప్పడం లేదు.
దిశ, బోథ్ : మండలంలోని సాంఘిక సంక్షేమ, ఐటీడీఏ పరిధిలోని ప్రభుత్వ ఆశ్రమ వసతి గృహాల విద్యార్థులకు చన్నీటితో స్నానాలు తప్పడం లేదు. ఆయా వసతి గృహాలలో లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ హీటర్లు పనిచేయకపోవడంతో ట్యాంకులను ఆశ్రయిస్తూ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మరికొన్ని వసతి గృహాలలో కాగబెట్టిన వేడి నీటితో విద్యార్థులు స్నానాలు చేస్తున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండగా సకాలంలో తరగతులకు హాజరుకావాలనే ఉద్దేశంతో ఉదయం గడ్డకట్టుకుపోయే చలిలో స్నానాలు చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వేడినీరు అందేలా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
మరమ్మతులు కరువు..
ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటర్లు చిన్న చిన్న కారణాలతో పని చేయడం లేదు. వీటిలో నిర్వహణ సక్రమంగా లేక నిరుపయోగంగా మారుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో చిన్నపాటి కారణాలతో చెడిపోయిన వాటికి కూడా అధికారులు మరమ్మతులు చేయడం లేదు. కనీసం చలికాలంలోనైనా సోలార్ హీటర్లకు మరమ్మతులు చేపట్టరా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయం పై అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ నర్సింగ్ ను వివరణ కోరగా కొన్ని వసతి గృహాలలో సోలార్ వాటర్ హీటర్లు పనిచేయడం లేదని, కోతులు విరగొడుతున్నాయని, వారం రోజులలో వాటిని బాగు చేయిస్తామని తెలిపారు.