నిధులు మరిన్ని రావాలంటే సీఎం మురవాలే... మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

జూన్ 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ వస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు బహిరంగ సభ విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.

Update: 2023-05-30 17:52 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్ : జూన్ 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ వస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు బహిరంగ సభ విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. సీఎం పర్యటన ఆద్యంతం విజయవంతం అయ్యేలా చూడాల్సిన బాధ్యతల పై ఆయన మంగళవారం రోజంతా బిజీ బిజీగా గడిపారు. ఉదయం నుంచి ఆయన పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారు. కలెక్టరేట్ ఏర్పాట్లు రెండో తేదీలోగా పూర్తి కావాలి. కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులు జూన్ రెండో తేదీలోగా పూర్తికావాలని ఇంద్రకరణ్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పనుల నిర్వహణ పై కలెక్టర్ వరుణ్ రెడ్డితో పలుదఫాలు మంత్రి సమీక్షించారు. మిగిలిపోయిన చిన్నచిన్న పనులు ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులకు అప్పగించి ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.

పార్టీ నేతలు కార్యకర్తలతో సమీక్ష..

కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి హాజరవుతున్న బహిరంగ సభ నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గం భారత్ రాష్ట్రసమితి నేతలు కార్యకర్తలతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం సాయంత్రం సమావేశం అయ్యారు. పట్టణంలోని దివ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం సభ విజయవంతం పై నేతలు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలతో పాటు పట్టణంలోని మున్సిపల్ వార్డుల వారీగా ప్రజాప్రతినిధులు పార్టీ బాధ్యులు ప్రణాళిక ప్రకారం జనాన్ని తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. లక్ష మందికి తగ్గకుండా జనం హాజరయ్యేలా నేతలు కార్యకర్తలు సమిష్టిగా పాటుపడాలన్నారు. నేతలకు వాహనాల ఇంచార్జితో పాటు సభకు వచ్చి వెల్లే సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రి పలు సూచనలు చేశారు.

జనం లక్షకు తగ్గొద్దు...

నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సందర్భంగా సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు లక్ష మందికి తగ్గకుండా చూడాలని మంత్రి సూచించారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి 50,000 ఖానాపూర్ ముధోల్ నియోజకవర్గం నుంచి 25 వేల చొప్పున జనం తరలివస్తారని అంచనా వేస్తున్నారు. జిల్లాకు మరిన్ని నిధులు భారీగా రావాలంటే సీఎం సభను జయప్రదం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి నేతలతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి, రేఖ నాయక్ తో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. సీఎం పర్యటన పూర్తయ్యేదాకా అధికార యంత్రాంగం తో పాటు అధికార పదవుల్లో ఉన్న నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News