తప్పు చేసిన వారిని తప్పించే యత్నం..

ఒకటి కాదు రెండు కాదు.. రూ.150 కోట్ల విలువైన సీఎంఆర్

Update: 2025-03-31 02:03 GMT
తప్పు చేసిన వారిని తప్పించే యత్నం..
  • whatsapp icon

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఒకటి కాదు రెండు కాదు.. రూ.150 కోట్ల  విలువైన సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) ధాన్యం అక్రమాలకు పాల్పడిన నిర్మల్ జిల్లా బైంసా ప్రాంత రైస్ మిల్లర్ల ఆగడాలకు సర్కారు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. దొడ్డిదారిన సంపాదించి సర్కారును ముంచే యత్నాలకు తెరలేపిన రైస్ మిల్లర్ల అక్రమాలను ప్రభుత్వ యంత్రాంగం తవ్వి తీస్తున్నది. కోట్ల రూపాయలు దండుకుని తమ పేరిట ఏమీ లేకుండా కుటుంబ సభ్యులు బంధువుల పేర్ల పేరిట ఆస్తులు కూడా పెట్టిన మిల్లర్ల అక్రమాలపై సర్కార్ నిఘా పెట్టినట్లు సమాచారం. రెవెన్యూ రికవరీ యాక్ట్ లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని కోట్ల రూపాయలు దండుకున్న రైస్ మిల్లర్లపై ప్రభుత్వం పోలీసు శాఖలతో కేసులు పెట్టించి అక్రమంగా ఆర్థించిన ఆస్తులను గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా చర్యలకు దిగినట్లు అధికార వర్గాలు విశ్వసనీయంగా వెల్లడించాయి.

తప్పు చేసిన వారిని తప్పించే యత్నం..?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లకు ప్రభుత్వం ప్రతి ఏటా రెండు సీజన్లలో సీఎంఆర్ ధాన్యం కేటాయిస్తూ వస్తుంది. గత ప్రభుత్వంలో జరిగిన అనేక అక్రమాలను అప్పటి అధికార యంత్రాంగం సైతం చూసి చూడనట్లుగా వదిలిపెట్టింది 2021 - 22 నుంచి ఇప్పటికీ మూడేళ్లపాటు జరిగిన సీఎంఆర్ ధాన్యం కేటాయింపుల్లో రైస్ మిల్లర్లు అధికారులు కలిసి సర్కారును నిలువునా ముంచారు. ఒక్క నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతంలోని రైస్ మిల్లర్లు సుమారు 150 కోట్ల మేర ధాన్యం డబ్బులు ఎగ్గొట్టారన్న ఫిర్యాదులు ఉన్నాయి ఈ ఫిర్యాదుల మేరకు ఇటీవల ప్రభుత్వం బైంసా ప్రాంతంలో ఉన్న మిల్లర్లపై కేసులు పెట్టింది. గతంలో ఇలాంటి తప్పులు చేసిన వారికి అక్కడి నేత ఒకరు ఆ కేసుల్లో నుంచి తప్పించే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు ముఖ్యమంత్రి స్థాయిలో తనకు సంబంధాలు ఉన్నాయంటూ చెప్పుకుని రైస్ మిల్లర్ల అక్రమాలకు అండగా నిలిచిన ఆరోపణలు కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. ప్రభుత్వానికి నష్టం చేకూర్చి తప్పు చేసిన వారిని కేసుల్లో నుంచి తప్పించే యత్నం చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండా ధాన్యం కేటాయించిన అధికార యంత్రాంగం తీరు వెనుక భారీ మొత్తంలో చేతులు మారాయని దీనివల్లనే సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లు ఇష్టారీతిన అమ్ముకుని సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారం రాష్ట్రస్థాయిలో సంచలనం సృష్టించగా... ఒక దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా అక్రమార్కులపై చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

క్షేత్ర పరిశీలన చేయకుండా... గోదాములనే మిల్లులు గా చూపి..!

గత ప్రభుత్వ హయాంలో మిల్లర్లకు సీఎంఆర్ ధాన్యం కేటాయింపులు, ప్రభుత్వానికి ధాన్యం అందించే విషయంలో అనేక అక్రమాలు జరిగాయి. ఈ క్రమంలోనే కొన్ని మిల్లులపై కేసులు కూడా అయ్యాయి, అప్పటి అధికారులు ఆర్ఆర్ యాక్టులు పెట్టడంతో పెద్దగా అక్రమ వ్యాపారులపై చర్యలు లేకుండా పోయాయి. కేసులు అయినా మిల్లర్లకు తిరిగి సీఎంఆర్ ధాన్యం కేటాయించే విషయంలో అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది వాస్తవానికి కేసులు అయిన మిల్లర్లకు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కేటాయించవద్దన్న నిబంధనలు ఉన్నాయి ఇక్కడే మిల్లర్లు అధికారులు మిలాఖత్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేసులు అయిన మిల్లులను ఇతరుల పేర్ల మీదికి మార్చడం, మళ్లీ అవే మిల్లులకు ధాన్యం కేటాయించడం, క్షేత్రస్థాయిలో రైస్ మిల్లులను అధికారులు తనిఖీ చేయకుండానే కనీసం మర యంత్రాలు లేని ఖాళీ గోదాములను రైస్ మిల్లులుగా రికార్డుల్లో చూపి పెద్ద ఎత్తున ధాన్యం కేటాయింపులు చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ధాన్యం కేటాయించిన అధికారులు మిల్లర్లు చేసిన ఆగడాలతో తర్వాత తలలు పట్టుకున్నారు.

లంచాలకు మరిగిన అధికారులు ఖాళీ గోదాములను రైస్ మిల్లులుగా చూపి ధాన్యం కేటాయించిన అధికారులపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈలోపే మిల్లర్లు సీఎంఆర్ ధాన్యాన్ని బియ్యం గా మార్చి పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అధికారులు ఒత్తిడి తేవడంతో పిడిఎస్ బియ్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వానికి రీసైక్లింగ్ చేసే దందాకు తెరలేపారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఇంకా 150 కోట్ల మేర మిల్లర్లు బకాయి పడిన వ్యవహారం పౌరసరఫరాల శాఖ తో పాటు అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారంలో అక్రమార్కులను తప్పించే క్రమంలో కొందరు రాజకీయ నేతలు మిల్లుల్లో భాగస్వామ్యం పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమంగా సంపాదించిన డబ్బులతో మహారాష్ట్ర ప్రాంతాల్లో మిల్లర్లు భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ధాన్యం దొంగలపై విజిలెన్స్’

సీఎంఆర్ ధాన్యం అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ యంత్రాంగాన్ని రంగంలోకి దింపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అక్రమంగా సంపాదించిన డబ్బులతో వ్యాపారులు కొనుగోలు చేసిన స్థిరాస్తులతో పాటు లావాదేవీలకు సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని తేల్చే పనిలో ఉన్నట్లు సమాచారం అవసరం అయితే ఐటీ శాఖ సహకారంతో అక్రమ ఆస్తులను గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా కార్యాచరణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అక్రమ దందాకు సహకరించిన అధికారులపై ఇప్పటికే ప్రభుత్వం వేటు వేసింది. నిర్మల్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్ పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గోపాల్ నర్సాపూర్ జి ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ రమాదేవి లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తమ సహకారం తో కోట్లు గడిచిన వ్యాపారులు సేఫ్ గా ఉండగా... లంచాలకు కక్కుర్తి పడ్డ అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకుంటున్నది.

Similar News