జిల్లాకు మంత్రి ఎందుకు వచ్చారో తెలియదు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరదలతో పంటలు మునిగి రైతులు హరిగోసపడుతుంటే కేవలం సీసీఐ,పెనుగంగను మాత్రమే చూసిన మంత్రి శ్రీధర్ బాబు ఆదిలాబాద్ పర్యటనకు ఎందుకు వచ్చారో అర్ధం కావడం లేదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు.

Update: 2024-09-03 11:13 GMT

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరదలతో పంటలు మునిగి రైతులు హరిగోసపడుతుంటే కేవలం సీసీఐ,పెనుగంగను మాత్రమే చూసిన మంత్రి శ్రీధర్ బాబు ఆదిలాబాద్ పర్యటనకు ఎందుకు వచ్చారో అర్ధం కావడం లేదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రైతులను పట్టించుకోకపోగా, వాళ్ల బాధలను వినక పోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి సమాచారం లేకుండా ఒక రాష్ట్ర మంత్రి జిల్లాలో పర్యటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వరదలతో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించాల్సిన మంత్రి సీసీఐని ఎందుకు సందర్శించారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ రైతుల బాధలు మంత్రికి తెలియజేయాల్సింది పోయి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వ్యవహరించారని ఆరోపించారు.

    1998లో మూతబడిన సీసీఐని గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతోనే పున ప్రారంభించడం సాధ్యం కాలేదని, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు కూడా ఆ విషయం తెలిసినా దానిని ప్రారంభించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదే విషయం స్థానిక ఎమ్మెల్యే కు తెలిసినా కేవలం ప్రజలను, యువకులను నమ్మించేందుకే సీసీఐ వద్దకు తీసుకువెళ్లారని, రైతులను విస్మరించారని మండిపడ్డారు. ఇది కేవలం కమీషన్ల కోసమేనని అన్నారు.

     పెనుగంగ నదిని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు దానికి సమీపంలోనే కామాయి గ్రామం వరద నీటితో రాకపోకలకు దూరమైన విషయం తెలిసి కూడా అక్కడికి వెళ్లలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ వ్యవహారం చూస్తుంటే రైతుల మీద ప్రేమ కంటే కమీషన్ల మీదనే ప్రేమ ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి పర్యటనతో కాంగ్రెస్, బీజేపీల సంబంధం తేటతెల్లమైందని, రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటే అన్నారు. ప్రజలు ఇప్పటికైనా ఈ రెండు పార్టీలను నమ్మి మోసపోవద్దని కోరారు. ఈ సమావేశంలో నాయకులు గండ్రత రమేష్, బ్రోకర్ల రమేష్, మాజీ ఎంపీటీసీ రమణ తదితరులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News