తహసీల్దార్ కార్యాలయంలో మాయాజాలం..

గత కొంతకాలంగా మందమర్రి తాసిల్దార్ కార్యాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా తయారైనట్లు కథనాలు వెలువడుతున్నాయి.

Update: 2023-02-14 09:37 GMT

దిశ, మందమర్రి : గత కొంతకాలంగా మందమర్రి తాసిల్దార్ కార్యాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా తయారైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. మండల తాసిల్దార్ కు పలువురు పెట్టుకున్న ఆర్జీల పై రెవెన్యూ ఆర్.ఐ విచారణ జరిపి జారీచేయాల్సిన ధ్రువపత్రాల విషయంలో అవకతవకలు జరిగాయి. దీంతో అన్యాయానికి గురైనా బాధిత లబ్దిదారులు ప్రతివారం మందమర్రి ఎంపీడీవో కార్యాలయంలో జరిగే (ప్రజావాణి) ప్రజాఫిర్యాదుల విభాగంలో అర్జిపెట్టుకున్నారు. దాంతో ఇప్పటివరకు బయటికి రాని వివాదాలు వెలుగు చూస్తున్నాయి. పలు ధ్రువపత్రాల జారీలో సంబంధిత అధికారులు మధ్యవర్టుల ద్వారా భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. కార్యాలయం నుండి పలుధ్రువపత్రాలు జారీ అక్రమంగా జరిగాయని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ విచారణ చేపించేందుకు తమ దగ్గర సిబ్బంది లేరని సంబంధిత అధికారులు సమస్యలను దాటేవేస్తున్నట్లు తెలుస్తోంది.

అందుగులపేట గ్రామపంచాయతీ మంగలికుంట ఊరచెరువు నీటిలో మునిగిన సర్వేనంబర్ 162/3/1. విస్తీర్ణం 5 ఎకరాలకు పట్టా పాస్ పుస్తకం ఇచ్చారు. తద్వారా లబ్ధిదారునికి రైతుబంధు డబ్బులు సంవత్సరానికి రెండుసార్లు బ్యాంకు ఖాతాలో జమ అవుతూనే ఉన్నాయి. ఈ పట్టాపాస్ పుస్తకాన్ని చూపిస్తూ తనకు భూమి ఉంది. అమ్ముతానని దళారుల ద్వారా నమ్మపలికిస్తూ ఇప్పటికీ ఇద్దరు వ్యక్తులకు భూ విక్రయాలు జరిపి దాదాపు 30 లక్షల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా పులిమడుగు పంచాయతీ ఒక కుటుంబానికి చెందిన వాటాదారులు ముగ్గురు ఉండగా తిమ్మాపూర్ శివారు సర్వే నంబర్ 269/3/3 లో 38 గుంటల భూమిని ఒక్కరికే చేశారని పేర్కొంటూ 6 ఫిబ్రవరి నాడు వాటాదారులు మందమర్రి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించు ప్రజా ఫిర్యాదుల విభాగానికి దరఖాస్తు చేసుకున్నారు.

కాగా ఫిర్యాదును స్వీకరించిన మండల తాసిల్దార్ విచారణకు రెవెన్యూ ఇన్స్- పెక్టర్ ను గ్రామానికి పురమాయించినట్లు తెలుస్తోంది. విచారణ కెళ్ళిన అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు గొడవ జరిగినట్లు సమాచారం. అందులో మరో కుటుంబం మందమర్రి ప్రెస్ క్లబ్ కు వచ్చి మాభూమి అసలు వారసురాలు హునికి కి 185/25లో ఐదు ఎకరాల 4 గుంటలు ఉండగా సర్వే నంబరు 259/3/3. లో 38 గుంటలు ఉందని తెలుస్తోంది. ఈ భూములను ముగ్గురికి విరాసత్ చేయవలసి ఉండగా అధికారులు ఇద్దరికీ చేసి చేతులు దులుపుకోవడం వివాదానికి తెరతీసింది.

సరైన ధ్రువపత్రాలు లేకుండానే పట్టా బదిలాయింపులు

గత కొంతకాలంగా మండల తాసిల్దార్ కార్యాలయంలో సరైన ధ్రువపత్రాలు లేకుండానే భూములకు పట్టాపాస్ పుస్తకాల జారీ, మిరాసత్ భూముల బదలాయింపు, సరైన ధ్రువపత్రాలు లేకుండా పట్టా మార్పిడీలు, కుటుంబ సభ్యుల ధ్రువపత్రాలు జారీ, ప్రభుత్వ భూములనుండి మట్టి, ఇసుక తరలింపు రెవెన్యూ కార్యాలయంలో ప్రవేట్ వ్యక్తులకు రికార్డుల అప్పగింత, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ గృహాల దరఖాస్తుల పరిశీలన తదితరుల విషయంలో వివాదాలు తలెత్తుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News