షరా మామూలే.. రిమ్స్‌లో రోగులకు తప్పని ఇక్కట్లు

వ్యాధుల కాలంలో ప్రజలు విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న

Update: 2024-09-23 16:25 GMT

దిశ, ఆదిలాబాద్ : వ్యాధుల కాలంలో ప్రజలు విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మాత్రం వైద్యం తీరు మారడం లేదు. మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉండాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారుతుంది. ముఖ్యంగా కోట్ల రూపాయలతో మెరుగైన వైద్యం పేదలకు అందించాలని లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లాకే తలమానికంగా నిర్మించిన రిమ్స్ ఆసుపత్రిలో రక్త పరీక్షలను నిర్ధారించే యంత్రాలు మూలనపడ్డాయి. ప్రస్తుతం విష జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో మూలకు పడిన యంత్రాలను బాగు చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆదిలాబాద్ రిమ్స్ లో సీ బీపీ యంత్రం పనిచేయకపోవడంతో రిమ్స్ ఆవరణలోనే ఉన్న టీడీ హబ్ నుంచి రక్త పరీక్షలు చేసి రోగులకు సంబంధిత నివేదికలను అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ సైతం పలుమార్లు యంత్రం మొరాయించడంతో రిమ్స్ కు వచ్చే రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంతో నమ్మకంతో రిమ్స్ కు వచ్చిన రోగులకు రక్త పరీక్షలు వల్ల తంటాలు తప్పడం లేదు. రిమ్స్ పాథాలజీ విభాగంలో సీబీపీ యంత్రాలు పాడై రోజులు గడుస్తున్న బాగు చేయకపోవడంతో పూర్తిస్థాయిలో రోగులకు రక్త నమూనాల పరీక్షలు జరగక ఇబ్బందులు పడుతున్నారు.

టీడీ హబ్ పై ఆధారం…

రిమ్స్ లో బయో కెమిస్ట్రీ విభాగంలో గత నాలుగు నెలలుగా రసాయనాలు లేక టీ హబ్ పైనే భారం పడటం వల్ల, ఇటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రక్త నమూనాలు అటు రిమ్స్ రక్త నమూనాలు అన్ని టి హబ్ లో పరీక్షలు చేయడం వల్ల ,ఇక్కడి యంత్రాలు కూడా తరచుగా మొరారిస్తున్నాయి. అటు రిమ్స్ లో సరిపడా రసాయనాలు లేకపోవడం, పరికరాలు చెడిపోవడం రోగులకు శాపంగా మారింది.

కనిపించని మార్పు..

రిమ్స్ తో పాటు టీడీ హబ్బులో తరచు యంత్రాలు వర్క్ లోడుతో పాడవడం, ల్యాబ్ టెక్నీషియన్లకు బదులుగా ల్యాబ్ అటెండర్లు, అర్హత లేని పేషంట్ కేర్ టెకర్  లతో రోగుల రక్త నమూనాలు తీసుకొని పరీక్షలు చేయడం దీనివల్ల రోగులకు ఇచ్చే రిపోర్టులపై అనుమానాలు ఉన్నాయన్న నేపథ్యంలో గతంలో ‘దిశ’ పత్రిక లో వచ్చినటువంటి కథనం ఆధారంగా రిమ్స్ డైరెక్టర్, డీఎం అండ్ హెచ్ ఓ లు టీ హబ్ ను వారం రోజుల క్రితం పలుమార్లు ఆకస్మిక తనిఖీలు చేశారు.అయినప్పటికీ అక్కడి పరిస్థితులో మాత్రం మార్పు రాలేదు. అంతేకాకుండా టీ హబ్ లో సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్లు పని చేయాల్సింది ఉండగా, ల్యాబ్ అటెండర్లు లు పేషంట్ కేర్ టెకర్ లతో, ట్రైనింగ్ విద్యార్థులతో పరీక్షలు నిర్వహిస్తున్నారని, పలుమార్లు ఆరోపణలు వచ్చిన వారిని తొలగించకుండా వారితోనే పరీక్షలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని రోగులు వాపోతున్నారు. నాణ్యమైన టువంటి పరీక్షల రిపోర్టులను రోగులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

అంతేకాకుండా రిమ్స్ పేథాలజీ విభాగంలో మూడు సీబీపీ యంత్రాలు ఉన్న ఒక్కటి కూడా పనిచేయకపోవడం శోచనీయం. అక్కడి రక్త నమూనాలను టీ హబ్ లో పరీక్షలు చేయడం జరుగుతున్నందున అది కూడా ల్యాబ్ టెక్నీషియన్ లుగా ట్రైనింగ్ పొందుతున్న టువంటి విద్యార్థులతో రక్త నమూనాల సేకరణ పరీక్షల నివేదికలు ఇవ్వడం జరుగుతున్నందున రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పడం లేదు. ఇదే విషయంపై పరిశీలన నిమిత్తం వెళ్లగా రెండు రోజుల క్రితం రాత్రి డ్యూటీ లో ల్యాబ్ టెక్నీషియన్ కి బదులుగా ట్రైనింగ్ విద్యార్థులు రిమ్స్ పేథాలజీ విభాగంలోని రక్త నమూనాలను టీ హబ్ నందు పరీక్షిస్తున్నప్పుడు ‘దిశ’ పత్రిక సందర్శించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్ పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రోగులకు నమ్మకమైన నివేదికలను ఇచ్చే విధంగా అధికారులను ఆదేశించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

ముఖ్యంగా ఒకవైపు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు ఎండాకాలం తలపించే ఎండలు ప్రజలను పెడుతున్నాయి. ఈ క్రమంలో సీజనల్ వ్యాధులతో పాటు విష జ్వరాలు వ్యాపించి ప్రజలను మంచం పట్టేలా చేస్తున్నాయి. ఇలాంటి క్రమంలో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా వైద్యాధికారులు, రిమ్స్ డైరెక్టర్ ప్రత్యేక చొరవతో అర్హులైన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News