గ్రామాల్లో చివరి దశకు ఇందిరమ్మ కమిటీల నియామకాలు
రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు ఇళ్ల కేటాయింపునకు సంబంధించి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపికలో కీలకమైన ఇందిరమ్మ కమిటీల ఎంపిక వేగంగా సాగుతోంది.
దిశ ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు ఇళ్ల కేటాయింపునకు సంబంధించి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపికలో కీలకమైన ఇందిరమ్మ కమిటీల ఎంపిక వేగంగా సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ కమిటీల నియామకాల ప్రక్రియ చివరి దశకు చేరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన బలహీన వర్గాల ఇళ్లకు సంబంధించి సత్వరమే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వెంటనే కమిటీల నియామకాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కమిటీల ఎంపికకు చర్యలు తీసుకుంటున్నది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ఆయా జిల్లాల కలెక్టర్లు ఇందిరమ్మ కమిటీల నియామకాలకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలలో 80 శాతానికి పైగా ఇందిరమ్మ కమిటీల నియామకాలు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే పట్టణ కేంద్రాలైన పురపాలక సంఘాలలో కొంత కమిటీల ఎంపిక ప్రక్రియ ఆలస్యం అవుతోంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్గర్, బెల్లంపల్లి, చెన్నూర్, ఖానాపూర్, భైంసా, లక్షెట్టిపేట, క్యాతన్ పల్లి, ఆసిఫాబాద్ తదితర మున్సిపల్ కేంద్రాల్లో వార్డు ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నచోట...
ఇందిరమ్మ కమిటీల ఎంపిక విషయంలో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తల దూర్చడం కారణంగా కమిటీల ఏర్పాటు మరికొంత ఆలస్యం జరిగేలా ఉంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన శాసనసభ్యులు ఉన్న ముధోల్, నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్, ఆసిఫాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో అధికార వర్గాలకు కొంత తలనొప్పిగా మారింది. నిష్పక్షపాతంగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన శాసనసభ్యులు వివాదాలకు దారితీస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సామాజిక అంశాల వారీగా అన్ని కులాలకు చెందిన వారిని కమిటీ సభ్యులుగా నియమించాల్సి ఉండడంతో... కొన్నిచోట్ల సభ్యుల ఎంపిక తమకు తలనొప్పి అవుతున్నదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా తాము కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపడితే కొందరు శాసనసభ్యులు, నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వచ్చే మూడు నాలుగు రోజుల్లో కమిటీల నియామకాలు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.