ఉమ్మడి జిల్లా నీటిపారుదలపై ఉన్నతస్థాయి సమీక్ష
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్‌లో వున్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్‌లో వున్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. రెండవ దశలో కొత్త చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్‌సీ మురళీధర్, ఆదిలాబాద్ సీఈ టి.శ్రీనివాస్, మంచిర్యాల సీఈ జి.శ్రీనివాస్ రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఇతర నీటిపారుదల శాఖ అధికారులతో సోమవారం అరణ్య భవన్ లో మంత్రి సమీక్ష నిర్వహించారు.
తమ నియోజక వర్గంలోని సాగునీటి అవసరాలు, చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు సమావేశంలో వివరించారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవడానికి సీయం కేసీఆర్ పలు ప్రాజెక్ట్ లు, బ్యారేజీలు, లిఫ్ట్ ఇరిగేషన్, చెక్ డ్యాంల నిర్మాణానికి పెద్ద పీట వేశారని, వాగులు, వంకలపై రెండవ దశలో మరిన్ని చెక్ డ్యాంలు నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులు కోరారు.
నియోజకవర్గాల వారీగా చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించి, నవంబర్ లేదా డిసెంబర్ వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, బ్యారేజీలు, చెక్ డ్యాంల నిర్మాణం ప్యాకేజీ 27, 28 పనులు పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, భూగర్భ జలాలూ పెరుగుతాయని మంత్రి తెలిపారు.
చనాక- కొరాట, ప్రాణహిత, నీల్వాయి, జగన్నాథపూర్, కుమ్రం భీం, వార్ధా, కుఫ్టీ ప్రాజెక్ట్ లు, చెన్నూర్, లక్ష్మింపూర్ లిఫ్ట్ ఇరిగేషన్, ప్యాకేజీ 27 & 28, సదర్మాట్ బ్యారేజీ, కడెం డ్యాంకు కొత్త గేట్ల బిగింపు, గోదావరి పరివాహాక వరద ముంపు ప్రాంతాల్లో కరకట్టల (ప్రొటెక్షన్ వాల్) నిర్మాణాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. పంపుహౌజులు, లిఫ్టులు, కాల్వల నిర్మాణ పురోగతి, అటవీ అనుమతులు గురించి అధికారులు వివరించారు. లక్ష్మింపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సంబంధించి అటవీ అనుమతుల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు.
భారీ వర్షాల వల్ల భైంసా పట్టణం, నిర్మల్ నియోజకవర్గం, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిదులు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి సమగ్ర అధ్యాయనం చేసి భద్రచలం తరహాలో వరద ముంపు ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు.
వార్దా నదిపై బ్యారేజ్ నిర్మాణం కోసం డీపీఆర్ ను తయారు చేసి అక్టోబర్ నెల చివరి నాటికి నీటిపారుదల శాఖ అధికారులకు సమర్పించాలని వాప్కోస్ కన్సల్టెన్సీని మంత్రి ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 28 లో పనులను పూర్తి చేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆ పాత కాంట్రాక్టర్ ను తొలగించి, రివర్స్ టెండర్ నిర్వహించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, కాల్వలపై వంతెనలు నిర్మించాలని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కోరారు.
దీనికి సంబంధించి ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభమ్యేలా చూస్తామని అధికారులు వివరించారు. సిర్పూర్ నియోజకవర్గంలో పెద్దవాగు పొంగిపోర్లుతుండటంతో రాకపోకలు స్తంభించి ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అవసరం ఉన్న చోట వంతెనలు నిర్మించాలని ఎమ్మెల్యే కొనేరు కోనప్ప కోరారు.