ప్రజాపాలనతో గడీల పాలనకు సమాధి
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజాపాలనతో నియంతృత్వ కేసీఆర్ గడీల పాలనకు ఇక సమాధి అయినట్లేనని జడ్పీటీసీల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
దిశ ప్రతినిధి, నిర్మల్ : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజాపాలనతో నియంతృత్వ కేసీఆర్ గడీల పాలనకు ఇక సమాధి అయినట్లేనని జడ్పీటీసీల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా చించోలి ( బి) గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనకు వస్తున్న ప్రజల కళ్ళలో కనిపిస్తున్న ఆనందం చూస్తే గడీల పాలన నుంచి విముక్తి లభించినట్లు ఉందన్నారు. ప్రజలకు స్వచ్ఛందంగా తమ సమస్యలు చెప్పుకునే వేదికగా ప్రజాపాలన సభలు సాగుతున్నాయన్నారు.
గత పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. ప్రజల సొమ్మును సొంత ఆస్తిలా దుబారా చేసిన కారణంగానే ధనిక రాష్ట్రం తెలంగాణ దివాలా తీసిందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కళ్ళకు కట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తే తట్టుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. అధికారం కోల్పోయిన బాధలో కేటీఆర్, హరీష్ రావు ఏవేవో మాట్లాడుతున్నారని, ఆరు నెలలు ఆగండి అంటూ తమ ఎమ్మెల్యేలను తాము అధికారంలోకి వస్తామని మభ్య పెడుతున్నారని ఆరోపించారు. దింపుడు కల్లం ఆశలు పెట్టుకున్న కేసీఆర్ కుటుంబం మళ్లీ అధికారం మరిచి పోవాలన్నారు. ప్రజలు, అధికారులు, ఉద్యోగుల సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పర్యాయాలు అధికారంలో ఉంటుందన్నారు. ముమ్మాటికీ తాము ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు అమలు చేసి తీరుతామన్నారు.