బెల్లంపల్లిలో భారీ వర్షం.. రైల్వే క్వార్టర్స్‌ను ముంచెత్తిన వరద నీరు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ

Update: 2024-08-25 14:16 GMT

దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే స్టేషన్ ఏరియాలోని రైల్వే క్వార్టర్స్ లోకి వరద నీరు చేరింది. ఇవాళ ఇళ్లలోకి వరద నీరు ఒక్కసారిగా చేరడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పట్టణంలోని రడగంబాలబస్తీలోని చెరువు నుంచి నీరు మూడో రైల్వే ట్రాక్ పనులు జరిగే ప్రాంతంలోకి చేరాయి. భారీ వర్షానికి వరద నీరు అక్కడ ఉన్న గుంతల్లో నిండింది. ఇదే సమయంలో రైల్వే ట్రాక్ వరద నీరు వెళ్లే అవకాశం ఉండడంతో రైల్వే అధికారులు అక్కడ గుంత కట్టను తెంపారు. ముందు చూపు లేకుండా అధికారులు, కాంట్రాక్టర్ చర్య వల్ల వరద నీరు పక్కనే ఉన్న రైల్వే క్వార్టర్స్, ప్రైవేటు ఇళ్లను ముంచెత్తింది.

నిమిషాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి వస్తువులన్నీ తడిచిపోయాయి. ఈ హఠాత్పరిణామానికి కంగారు పడిపోయి ప్రజలు పరుగులు తీశారు. మూడో రైల్వే ట్రాక్ కోసం గోడను పగలగొట్టడం తో వరద ఇళ్లలోకి చేరినట్లు స్థానికులు తెలిపారు. రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే వరద నీరు ఇళ్లలోకి చేరిందని ఘటనాస్థలిని సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత ఆరోపించారు. నీటి గుంత కట్ట తెంపే ముందు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. రైల్వే కాంటాక్ట్ అధికారుల నిర్లక్ష్యం విషయమై ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు.


Similar News