ప్రతి ఇంటికి డిజిటల్ కార్డు ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సంక్షేమ పథకాలకు వర్తింపచేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ను ప్రతి ఇంటికి ఒకటి అందించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు.

Update: 2024-10-10 15:30 GMT

దిశ, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సంక్షేమ పథకాలకు వర్తింపచేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ను ప్రతి ఇంటికి ఒకటి అందించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలెట్ ప్రాజెక్టు, ఎల్ఆర్ఎస్ (లే అవుట్స్ క్రమబద్ధీకరణ ), ధరణిలపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ రూరల్ లోని లోహార, గుడిహత్నూర్ మండలంలోని గోండు హార్కాపూర్, ఇచ్చోడ మండలంలోని ఆడేగంబి, మున్సిపాలిటీలోని రామ్ నగర్ 11వ వార్డులలో టీంల వారీగా ఇంటింటికి తిరిగి సర్వే పూర్తి చేసినట్టు పేర్కొన్నారు.

     ఈ సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇవ్వాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్ వార్డు, గ్రామపంచాయతీని పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినట్టు చెప్పారు. కుటుంబ వివరాలతో పాటు ఫొటో తీసుకున్నారని, సేకరించిన సమాచారాన్ని ఆన్ లైన్ లో ఫ్యామిలీ ఫొటో తో సహా డేటా ఎంట్రీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ ఫొటో తీసుకోని వారి ఇంటికి వెళ్లి రేపటి లోగా ఫొటో తీసుకొని ఆన్ లైన్ చేయాలని సూచించారు. సర్వేలో కొన్ని చోట్ల కుటుంబ ఫొటో తీయకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

    అనంతరం ఎల్ఆర్ ఎస్ పై సమీక్షిస్తూ భూముల క్రమబద్దీకరణ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఈ ప్రక్రియ ఈనెల చివరి నాటికి పూర్తి చేయాలని, పంచాయతీ సెక్రటరీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు టీంగా వెళ్లి పరిశీలించి క్లియర్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో 8,994 దరఖాస్తులకు గాను 1001 పరిశీలించి 757 అప్రూవ్ చేసినట్టు తెలిపారు. మిగిలినవి ప్రతి రోజూ 20 చొప్పున పరిశీలించి గడువులోగా లక్ష్యాలను సాధిస్తామని డీఎల్పీఓ తెలిపారు. టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తెలపాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వినోద్ కుమార్, డీపీఓ శ్రీలత, తహసీల్దార్లు, పంచాయతీ, ఇరిగేషన్, ఎంపీడీఓ, ఎంపీఓలు పాల్గొన్నారు.  

Tags:    

Similar News