జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టాలి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీనివల్ల ఆదిలాబాద్ జిల్లాలో పంటలు నష్టపోకుండా, ప్రాణాలకు హాని కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.

Update: 2024-09-03 12:51 GMT

దిశ, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీనివల్ల ఆదిలాబాద్ జిల్లాలో పంటలు నష్టపోకుండా, ప్రాణాలకు హాని కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న మంత్రి ముందుగా అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిమెంట్ ఫ్యాక్టరీని, పెన్ గంగా వరద ఉధృతిని, రాజు స్వగృహలో చేపడుతున్న ఐటీ టవర్ నిర్మాణ పనుల తీరును ఆయన మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, శాసన సభ్యులు పాయల్ శంకర్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు రావడం వలన జిల్లా లో వాగులు వంకలు చెరువులో ప్రాజెక్టులు వరద నీటితో నిండిపోయి ప్రమాదాలకు దారితీస్తున్నాయన్నారు.

     ఇలాంటి తరుణంలో ముఖ్యంగా పంటలు నష్టపోయే అవకాశం ఉందని, ఇప్పటివరకు వందల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు తన దృష్టికి వచ్చిందని తెలియజేశారు. ఇంకా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఇప్పటివరకు జరిగిన నష్ట నివారణ పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాకు రావడం జరిగిందని తెలిపారు. జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క మూడు రోజుల పాటు మహబూబాబాద్ జిల్లాలో ఉండి పర్యవేక్షిస్తూ ఉండడం వలన జిల్లాకు రాలేక పోయారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో సోమవారం నిర్మల్ లోని కడెం ప్రాజెక్టు, మంగళవారం అదిలాబాద్ లో పర్యటించడం జరిగిందని తెలియజేశారు. పెన్ గంగ ఎగువన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టు లలో నీరు అధికంగా రావడంతో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అధికార, మానవ ప్రయత్నం లోపం లేకుండా ప్రాణాలను,ఆస్తులను కాపాడాలని సూచించారు.

    గడిచిన మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలతో జరిగిన పంట నష్టరిహారాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని, నష్ట పరిహారం విషయం లో రైతులకు అండగా ఉండి ఆదుకుంటామని భరోసా వ్యక్తం చేశారు. దీనికి శాశ్వత పరిష్కారం కొరకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ పెన్ గంగా పరీవాహక ప్రాంతాల్లో పంటలు కొంత వరకు నీట మునిగిపోయాయని, ఇలాంటి విపత్తులు ఎదుర్కోవడానికి కరకట్టలు ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంతాలను గుర్తించి అలాంటి నిర్మాణాలు చేపడితే రైతులకు మేలు జరుగుతుందని మంత్రిని కోరారు. ఇందులో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News