మావోయిస్టులకు సహకరించొద్దు: ఎస్పీ కే. సురేష్ కుమార్
మావోయిస్టులకు గిరిజనులు సహకరించొద్దని కొమరం భీం జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ అన్నారు.
దిశ, కాగజ్ నగర్: మావోయిస్టులకు గిరిజనులు సహకరించొద్దని కొమరం భీం జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ అన్నారు. గురువారం కాగజ్ నగర్ మండలం మాలిని గ్రామ పంచాయతీ మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న మాణిక్ పటార్ గ్రామాన్ని జిల్లా అడ్మిన్ ఎస్పీ అచ్చేశ్వరరావుతో కలిసి అడవిలో బైక్ పై 8 కి.మీ ప్రయాణం చేసి గ్రామాన్ని సందర్శించారు. పోలీసులు మీకోసంలో భాగంగా గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
గిరిజనులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే అత్యంత మారుమూల అటవీ ప్రాంతంలో మాణిక్ పటార్ గ్రామం ఉందన్నారు. గ్రామస్థులకు ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసులకు తెలియజేయాలని కోరారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం చూపిస్తారని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో యువత మావోయిస్టు ప్రలోభాలకు గురికావొద్దని, వారికి సహకరించొద్దని పిలుపునిచ్చారు. అపరిచితులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో సంక్షేమం, అభివృద్ధి దిశగా పని చేస్తుందని పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, మెరుగైన వైద్యం విద్య అందించేందుకు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్థలకు నిత్యవసర వస్తువులు, యువతకు వాలీబాల్ క్రికెట్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్, రూరల్ సీఐ నాగరాజు, ఎస్సై సోనియా, తదితరులు ఉన్నారు.