బీఆర్ఎస్ ‘ఆత్మీయ సమ్మేళనాలపై సీనియర్ల పెదవి విరుపు

పార్టీ కార్యకర్తలు అందరిని ఒక చోటికి పిలిచి వారితో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు కూర్చుని మాట్లాడుకోవాలి.

Update: 2023-03-21 03:05 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్: పార్టీ కార్యకర్తలు అందరిని ఒక చోటికి పిలిచి వారితో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు కూర్చుని మాట్లాడుకోవాలి.. మంచి చెడులపై చర్చించుకోవాలి.. భవిష్యత్తులో పార్టీ నిర్మాణంపై చర్యలు తీసుకునేలా అందరూ కలిసికట్టుగా ఉండాలి.. అందుకు ఆత్మీయ సమ్మేళనాల పేరిట ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలను నిర్వహించాలని అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించిన నేపథ్యంలో మంగళవారం నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 24వ తేదీ లోపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి కావాలని కేటీఆర్ ఆదేశించిన నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఈ సమ్మేళనాలకు హాజరు శాతంపై నియోజకవర్గ నేతల్లో ఆందోళన కనిపిస్తుంది.

ఎన్నికలప్పుడే గుర్తుకొస్తున్నామా..

ఆత్మీయ సమ్మేళనాలు అంటూ అధికార పార్టీ కొత్త రాగం అందుకున్నదని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు వస్తేనే తాము గుర్తుకు వస్తున్నామని అధికారంలో ఉన్నంత కాలం తమను పట్టించుకోవడం లేదని వారి ఆవేదన వెలుగుతున్నారు. భారత్ రాష్ట్ర సమితి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమను మరింత అధ్వాన్నంగా మార్చాలని ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడిన తమను అసలే పట్టించుకోలేదని ఉద్యమ కాలం నాటి నేతలు అభిప్రాయపడుతున్నారు. తమతో పాటు తమ కోసం పనిచేసిన కార్యకర్తలను వారి కుటుంబాలను నిర్వీర్యం చేశారని చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పిలుస్తున్నారని చెబుతున్న నేతలు... సమ్మేళనాలకు వెళితే దశాబ్ద కాలంగా తమను నమ్ముకున్న కార్యకర్తలతో చీవాట్లు పడాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

అన్ని నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తి..

ఈనెల 24వ తేదీ లోగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో మంగళవారం నుంచి ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభం ఉన్నాయి. తొలుత చెప్పిన ప్రకారం ప్రతి 10 గ్రామాలకు ఒక కార్యక్రమం నిర్వహించేలా చూడాలని చెప్పినప్పటికీ అది ఆచరణ సాధ్యం కాదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఒక్కో మండలంలో అన్ని గ్రామాల ప్రజలను పిలిపించి రోజుకు రెండు నుంచి మూడు మండలాల సమ్మేళనాలు నిర్వహించేందుకు కార్యాచరణ చేశారు. అయితే అన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలు సమ్మేళనాలకు హాజరవుతారా లేదా అన్నది అనుమానంగా కనిపిస్తుంది.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు మాజీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి సీనియర్ నేత బాలూరి గోవర్ధన్ రెడ్డి నడుమ వైరం ఉంది బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు, మాజీ ఎంపీ జి నగేష్, బోత్ ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యుడు అనిల్ జాదవ్‌తో వైరం మాట పక్కన పెట్టి అసలు మాటలే లేవు. నిర్మల్ నియోజకవర్గంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కే శ్రీహరి రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి సత్యనారాయణ గౌడ్ తో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి తీవ్రస్థాయి విభేదాలు ఉన్నాయి. ముధోల్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే జి విట్టల్ రెడ్డి తో అక్కడి సీనియర్లు కొందరు విభేదిస్తున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ పై సొంత పార్టీలో పెద్ద మొత్తంలోనే విభేదాలు ఉన్నాయని ప్రచారం ఉంది. అయితే ఆమెను బయటకు ఎవరు బలంగా తెరపైకి వచ్చి వ్యతిరేకిస్తున్న నేతలు కనిపించడం లేదు.

ఇక తూర్పు జిల్లాలోని మంచిర్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావును మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ తో మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి తదితరులు వ్యతిరేకిస్తున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కును జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మీ వర్గం వ్యతిరేకిస్తున్నది కొందరు సీనియర్లు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు.

ఇక సిర్పూర్ నియోజకవర్గంలో కోనప్పను బలంగా వ్యతిరేకించే నేతలు బయటకు కనిపించడం లేదు. అయితే పార్టీలో అంతా వారి కుటుంబమే ఆధిపత్యం చలాయిస్తుందన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పార్టీలోని ఒక వర్గం మరో నేతకు టికెట్ ఇప్పించే స్థాయిలో వర్గ పోరు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు ఏ మేరకు జయప్రదం అవుతాయన్నది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News