డైట్ లెక్చరర్ల ఖాళీలను భర్తీ చేయాలి..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డైట్, బీఎడ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ను విడుదల చేయాలని ఎంఎడ్ టీచర్ ఎడ్యుకేటర్స్ ఫోరమ్ ప్రతినిధులు అన్నారు.
దిశ, నిర్మల్ కల్చరల్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డైట్, బీఎడ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ను విడుదల చేయాలని ఎంఎడ్ టీచర్ ఎడ్యుకేటర్స్ ఫోరమ్ ప్రతినిధులు అన్నారు. సోమవారం నిర్మల్ పర్యటనకు వచ్చిన రాష్టవిద్యాశాఖమంత్రి సబితారెడ్డి, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్ఎడ్ అభ్యర్థులు, ఫోరమ్ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది 10 ప్రభుత్వ డైట్ కళాశాలలో, బి.ఎడ్ కళాశాలలో, యూనివర్సిటీల స్థాయిలో ఖాళీలను ఎమ్ఎడ్ అభ్యర్థులతో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, డీఈఓ పోస్టులను కూడా ప్రభుత్వం రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలన్నారు. ఈ రెగ్యులర్ నియామకారులు రెండు పీజీలు చేసిన, నెట్, సెట్, పీహెచ్డీ లాంటి అదనపు అర్హతలు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఫోరమ్ ప్రతినిధులు జుట్టు చంద్రశేఖర్, సతీష్ కుమార్, రవీందర్, రఫీ, సురేష్ తదితరులు ఉన్నారు.