నస్పూర్ బల్దియా చైర్మన్ కు పదవీ గండం.. అవిశ్వాసానికి కౌన్సిలర్ల ప్లాన్..?

మంచిర్యాల జిల్లా నస్పూర్ పురపాలక సంఘం ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Update: 2023-01-30 07:10 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్: మంచిర్యాల జిల్లా నస్పూర్ పురపాలక సంఘం ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అధికార BRS పార్టీకి చెందిన ఇసంపల్లి ప్రభాకర్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అధికార పక్షానికి చెందిన 16 మంది కౌన్సిలర్లలో వైస్ చైర్మన్ సహా మరో ఐదుగురు కౌన్సిలర్లు వ్యతిరేకిస్తున్నారు.

అలాగే కాంగ్రెస్ బీజేపీ సీపీఐ పార్టీలకు చెందిన మరో 7 మంది కౌన్సిలర్లు కూడా చైర్మన్ తీరును నిరసిస్తూ.. సోమవారం జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అభివృద్ధి పనుల్లో తమను సంప్రదించడం లేదని కౌన్సిలర్లు కొంతకాలంగా ఆయనపై గుర్రుగా ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాల చైర్మన్‌లపై అవిశ్వాస తీర్మానాల వ్యవహారం జోరందుకున్న నేపథ్యంలో నస్పూర్ మున్సిపాలిటీలోనూ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు అక్కడ కౌన్సిలర్లు సన్నద్ధం అవుతున్నారు. ఈ సమాచారం ఎమ్మెల్యే దివాకర్ రావు కు చేరింది. దీంతో ఆయన రంగ ప్రవేశం చేసి వ్యవహారాన్ని సరిదిద్దేల ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కాగా మున్సిపల్ సమావేశాన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికార పక్షానికి చెందిన కొందరు కౌన్సిలర్లు బహిష్కరించి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాలను బట్టి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News