చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి మహార్దశ...
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మహార్దశ సంతరించుకుంది.
దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మహార్దశ సంతరించుకుంది. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరడంతో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఏడు కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గత 47 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆస్పత్రి 30 పడకల పరిమితితోనే కొనసాగుతుంది. జనాభా పెరిగిన దృష్ట్యా మహారాష్ట్ర, చత్తీస్గడ్ ప్రాంతాల నుండి కూడా పేషెంట్లు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 150 గ్రామాల ప్రజలకు ఈ ఆస్పత్రి నుండే వైద్య సేవ అందుతున్నాయి.
గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రభుత్వాసుపత్రిలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషితో పట్టణంలో ఈ ఆస్పత్రిని 100 పడకలకు పరిమితికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, పట్టణ ప్రజలు పట్టణంలోని బస్టాండ్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.