గడువు పెంచుతున్నా.. పూర్తికాని సీఎంఆర్..

పెరిగిన ధాన్యం దిగుబడితో లాభాలార్జిస్తున్న మిల్లర్లు సీఎంఆర్ (కష్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యాన్ని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.

Update: 2023-03-09 17:15 GMT

దిశ, మంచిర్యాల : పెరిగిన ధాన్యం దిగుబడితో లాభాలార్జిస్తున్న మిల్లర్లు సీఎంఆర్ (కష్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యాన్ని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. నిరంతరం తనిఖీలు చేయాల్సిన సంబంధిత అధికారుల తనిఖీలు నామమాత్రం కావడంతోనే మిల్లర్ల ఇష్టారాజ్యం నడుస్తోందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. జిల్లాలో గత 2021- 22 వానాకాలం, యాసంగి సీజన్లకి సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాన్ని సగం మిల్లులు కూడా చేరుకోలేదు. ఆ సీజన్లకు సంబంధించి సీఎంఆర్ గడువు గత నెలాఖరికే పూర్తయిన రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రఆహార మంత్రిత్వ శాఖ ఈనెలాఖరుకి గడువును పొడిగించింది. ఆ తర్వాత గడువు పొడిగించబోమని స్పష్టం చేసింది. అయినా రైస్ మిల్లర్లు చేస్తున్న అలసత్వంతో ఈ గడువులోగా నైనా సీఎంఆర్ లక్ష్యం పూర్తవుతుందా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది.

ఇదీ పరిస్థితి...

జిల్లాలో 50 రైస్ మిల్లులు ఉండగా అందులో 35 రా రైస్ మిల్లు ఉన్నాయి. 2021- 22 వానాకాలం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం సివిల్ సప్లై శాఖ అధికారులు ఆ మిల్లులకు అప్పగించారు. ఆ మిల్లుల నుంచి ఆ యేడాది వానాకాలానికి సంబంధించిన 91,910 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ని పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంది. ఆ వానాకాలాపు సీఎంఆర్ 77,351 మెటిక్ టన్నులు మాత్రమే పూర్తి చేసి సివిల్ సప్లై శాఖకు అప్పగించారు. ఇంకా మిల్లర్లు అప్పగించాల్సిన 14,559 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ మిగిలి ఉంది. 2021-22 యాసంగికి సంబంధించి 52,649 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ కి గానూ 26,263 మెటిక్ టన్నులు మాత్రమే పూర్తి చేసి అప్పగించారు. 26,299 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం రావాల్సి ఉంది.

లక్ష్యానికి ఇంకా దూరమే...

2021-22 వానాకాలం సీఎంఆర్ రైస్ జిల్లాలోని 50 మిల్లుల్లో నుంచి 24 మిల్లులు లక్ష్యాన్ని పూర్తి చేయగా, 26 మిల్లులు లక్ష్యాన్ని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయి. యాసంగి సీఎంఆర్ కి ధాన్యాన్ని 40 మిల్లులకు అప్పగించగా అందులో 18 మిల్లులు లక్ష్యాన్ని పూర్తి చేయగా, 22 మిల్లులు సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తి చేయలేదు. మొన్నటి 2022-23 వానాకాలం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం సివిల్ సప్లై శాఖ ద్వారా సీఎంఆర్ కోసం జిల్లాలోని రైస్ మిల్లులకు చేరింది. కాగా, నిబంధనల ప్రకారం సీఎంఆర్ ధాన్యాన్ని మరాడించి 60 రోజుల్లోగా సివిల్ సప్లై శాఖకు అప్పగించాలి. క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల బియ్యం చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. గత వానాకాలం, యాసంగి సీజన్ల లక్ష్యాన్ని పూర్తి చేయని మిల్లర్లు మొన్నటి వానాకాలం సీఎంఆర్ ను సకాలంలో పూర్తి చేస్తారా? లేదా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తిచేయడంలో మిల్లర్లు చేస్తున్న జాప్యంతో ఎన్నో అనుమానాలకు దారితీస్తున్నాయి. అధికారులు ఒత్తిడి చేస్తే రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిరంతరం రైస్ మిల్లులను ఆయా మండలాల డిప్యూటీ తహసీల్దార్ అధికారులు తనిఖీలు చేపట్టాలి. మిల్లుల రిజిస్టర్లు, సీఎంఆర్ స్టాక్ రికార్డులు పరిశీలించాలి. కాగా మిల్లుల్లో అధికారుల నిరంతర పర్యవేక్షణ నామమాత్రంగా జరుగుతుండటంతోనే సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తిచేయడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా సివిల్ సప్లై శాఖ డీఎం ప్రేమ్ కుమార్ ను 'దిశ ' సంప్రదించగా గత వానాకాలం, యాసంగికి సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాన్ని ఈ నెలాఖరు గడువులోగా పూర్తి చేయించేందుకు చర్యలు చేపడుతున్నాం. లక్ష్యం పై నిర్లక్ష్యం చేస్తున్న మిల్లర్లకు నోటీసులు జారీ చేశాం. గడువులోగా సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తిచేయని మిల్లర్ల పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం.

Tags:    

Similar News