సందేహాలను నివృత్తి చేస్తూ ముందుకు సాగాలి : కలెక్టర్
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ,కుల సమగ్ర సర్వే ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం అయింది.
దిశ, ఆదిలాబాద్ : సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ,కుల సమగ్ర సర్వే ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో సర్వే పై హైదరబాద్ లోని తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా లతో కలిసి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో వారు మాట్లాడుతూ… ఆదిలాబాద్ జిల్లాలో ఇళ్ల జాబితా (హౌస్ లిస్టింగ్) పూర్తి చేసుకుని ఇంటింటి సర్వే ప్రారంభమయిన సందర్భంగా కలెక్టర్లు, ఎన్యుమరేటర్లు పకడ్బందీగా సమగ్ర సర్వే సమాచారం నమోదు చేయాలని తెలిపారు. ఇందులో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని,వాటిని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు.
ఎలాంటి సందేహాలు ఉన్నా ఎన్యుమరేటర్లు, కలెక్టర్ల దృష్టికి తేవాలని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడకుండా ఎన్యుమరేటర్లు కు సమాచారం ఇవ్వాలని కోరారు. సర్వే ప్రక్రియలో ప్రజల పట్ల ఎన్యుమరేటర్లు బాధ్యతగా వ్యవహరించాలని,మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వేలో భాగస్వాములయ్యేల చూడాలని,ప్రజల సమగ్ర సమాచారం సేకరణ వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు అందించి,వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడానికి దోహదపడతాయని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. సర్వే కోసం జారీ చేసిన బుక్ లెట్ లో మొత్తం 56 అంశాలున్నాయని, ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుండి ఖచ్చితమైన సమాచారం సేకరణతో సిబ్బంది నమోదు చేస్తున్నారని తెలిపారు.సర్వే ప్రక్రియను సూపర్ వైజర్లు, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే ప్రక్రియను నిబద్ధతతో,ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహిఇస్తున్నారని వివరించారు. ఏలాంటి సందేహాలు ఉన్న ఎంపిడిఓ, తహశీల్దార్ల దృష్టికి తేవాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి,ఆర్డీవో వినోద్ కుమార్,జడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, డి ఈ ఓ ప్రణీత, మున్సిపల్ కమిషనర్,డిపిఒ శ్రీలత, డి ఎల్ పి వో ఫణీంద్ర, తదితరులు పాల్గొన్నారు.