తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది.. ఎమ్మెల్యే గడ్డం వివేకానంద

ప్రజా కంటక కేసీఆర్ ప్రభుత్వం కూలింది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం వచ్చిందని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వివేకానంద స్పష్టం చేశారు.

Update: 2023-12-08 07:25 GMT

దిశ, మందమర్రి : ప్రజా కంటక కేసీఆర్ ప్రభుత్వం కూలింది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం వచ్చిందని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వివేకానంద స్పష్టం చేశారు. చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది శుక్రవారం మందమర్రి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు గృహానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను చెన్నూరు నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించడానికి సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రజలకి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతను చేపట్టిన మొదటి రోజే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గారెంటీల ఫైల్ పై మొదటి సంతకం చేశాడని అన్నారు. సింగరేణి కంపెనీలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఎక్కువ శాతం స్థానికేతరులు పనులు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. ఇకనుండి స్థానికులకే ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపడతామని వివరించారు. సింగరేణిలో పదవి విరమణ చెందిన కార్మికులకు సకాలంలో బకాయిలు రావడం లేదని స్థానిక ఐఎన్టీయూసీ నాయకులు తమకు తెలిపారని అన్నారు. ఈ విషయాన్ని సీఎం యనమల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సకాలంలో జీతాలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా సింగరేణి సీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులను ఇతర జిల్లాలకు కేసీఆర్ ప్రభుత్వం మళ్లించిందని, వాటిని కేవలం సింగరేణి ప్రాంతంలోనే ఉపయోగించుకునేలా చూస్తానని అన్నారు. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ నిరంకుశ ప్రభుత్వం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం వల్ల చెన్నూరు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని ఆయన కితాబిచ్చారు. ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసిన కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షులు బండి సదానందం, సీనియర్ నాయకులు దుర్గం నరేష్, ఎండి పాషా, పైడిమల్ల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News