బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు నిఘా నేత్రాలు…
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ భద్రతపై పోలీసులు ఫోకస్ పెట్టారు.
దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ భద్రతపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మావోయిస్టు పార్టీ హెచ్చరికతో పోలీసు యంత్రాంగం ఇప్పటికే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు మెటల్ డిటెక్టర్, అదనపు పోలీసు, ఆధునిక రక్షణ చర్యలను చేపట్టారు. అంతేకాకుండా ఎమ్మెల్యేకు వ్యక్తిగత భద్రతను కూడా రెట్టింపు చేశారు.అంతటితో ఆగకుండా క్యాంప్ ఆఫీస్ కు సైతం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సీసీ కెమెరాలు ఏర్పాటు పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంప్ ఆఫీస్ కు కట్టుదిట్టమైన భద్రత చర్యలను తీసుకుంటున్నారు. అందులో భాగంగానే క్యాంప్ ఆఫీస్ చుట్టూ నిఘా నేత్రాల పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటుకు సంకల్పించారు.
10 కెమెరాలు ఏర్పాటు..
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంప్ ఆఫీస్ కు 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆఫీసుకు నలువైపులా సీసీ కెమెరాలను అమర్చారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ దగ్గర ఉండి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలో టెక్నీషియన్లకు సూచించారు. ఏసీపీ మార్గదర్శకాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎటు కిలోమీటర్ రేంజ్ లో సీసీ కెమెరాలు రాకపోకలను బంధిస్తాయి. అత్యంత ఆధునికమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. క్యాంప్ ఆఫీసు చుట్టూ పరిసరాలు సీసీ కెమెరా నిఘాలో ఉంటాయి. ఇకనుంచి అనుక్షణం నిఘా నేత్రాల కనుసన్నల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది.
భద్రతా వలయంలో ఎమ్మెల్యే..
జిల్లాలో ఎక్కడా లేని పరిస్థితి బెల్లంపల్లి లో నెలకొంది. ప్రధానంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనూహ్యంగా మావోయిస్టులకు టార్గెట్ అయ్యాడు. అందుకు మావోయిస్టుల హెచ్చరిక లేఖలు ఎమ్మెల్యేకు మూడు దఫాలుగా జారీ కావడం జిల్లాలో కలకలం సృష్టించాయి. దీంతో జిల్లాలో ఏ ఎమ్మెల్యే కు లేని పరిస్థితి బెల్లంపల్లి ఎమ్మెల్యేకు దాపరించింది. దీంతో ఆయనకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు అవసరం వచ్చాయి. తాను నివాసం ఉండే క్యాంప్ ఆఫీసుకు మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేయడం ఆయన కు ఏ స్థాయిలో భద్రత అవసరమొ స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా అంగరక్షల సంఖ్యను రెట్టింపు చేశారు.
కంటికి రెప్పలా ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కాపాడుకోవడం పోలీసుల ప్రధాన విధిగా మారింది. ఎప్పటికప్పుడు భద్రత చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు భద్రతపై మరింతగా దృష్టి కేంద్రీకరించారు. పోలీసులు తీసుకుంటున్న భద్రతా చర్యల నేపథ్యంలో మావోయిస్టుల నుంచి ఎమ్మెల్యేకు ముప్పు ఉందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఉన్న క్యాంప్ ఆఫీస్ వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.