బాసర ఆలయ పునఃనిర్మాణానికి శ్రీకారం..
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పున:నిర్మాణ పనులకు శుక్రవారం అంకురార్పణ జరిగింది.
దిశ, బైంసా : బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పున:నిర్మాణ పనులకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. రాష్ట్రా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సరస్వతి అమ్మవారి గర్భాలయ పునఃనిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ పున:నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారని, ఇప్పటికే రూ.8కోట్ల వ్యయంతో ఆలయ పరిసరాల్లో విశ్రాంతి భవనాలు, తదితర పనులు చేపట్టగా, రూ.22 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి విజయరామారావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.