Telangana Elections 2023 : ఆదివాసీల ఓట్లకు గాలం..!

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆదిలాబాద్ పర్యటనలో ఆదివాసీలను ఆకర్షించేలా ప్రసంగించారు.

Update: 2023-10-11 02:39 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆదిలాబాద్ పర్యటనలో ఆదివాసీలను ఆకర్షించేలా ప్రసంగించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా మల్టీపర్పస్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో షా స్పీచ్ తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలను ప్రసన్నం చేసుకునే యత్నం చేశారు. గడిచిన పదేళ్ల కాలంలో ఆదివాసీలు అన్యాయానికి గురయ్యారని, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారంతో నే ఆదివాసీలకు సంక్షేమ ఫలాలు అందలేదని తీవ్రస్థాయిలో అమిత్ షా ఫైర్ అయ్యారు.

ఆదివాసీ ఓట్లను బ్యాంక్ చేసుకునే లక్ష్యంగా..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 8 లక్షల దాకా గిరిజన ఓట్లు ఉన్నాయి. ఇందులో 70 శాతానికి పైగా ఆదిమగిరిజనుల ఓట్లు ఉండటంతో వారి ఓట్లను ఆకర్షించే దిశగా అమిత్ షా ప్రసంగించారు. జిల్లాలోని బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. ఈ మూడు చోట్ల గిరిజన అభ్యర్థులు పోటీలో ఉండనున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభ నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాలు ఆదిలాబాద్ చుట్టూ ఉన్నాయి. దీంతో భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు అమిత్ షా సభకు ఆదివాసులను తరలించారు. ఆదివాసులకు కేసీఆర్ పాలనలో తీవ్ర అన్యాయం జరిగిందని అమిత్ షా ఆరోపించారు. వారి హక్కులకు భంగం కలిగించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయిందని మండిపడ్డారు.

గిరిజన యూనివర్సిటీ ఘనత మాదే..

తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని దేనని, ప్రధాని నరేంద్ర మోడీ కల యూనివర్సిటీ ఏర్పాటుతో తీరిందన్నారు. మరోవైపు ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము ను భారత రాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీ దేనని ఈ విషయాన్ని ఆదివాసీ గిరిజనులు మర్చిపోవద్దని గుర్తు చేశారు. అలాగే కొమరం భీమ్ పుట్టిన ఈ గడ్డ.. ఆదిలాబాద్ ఆదివాసుల అడ్డా అంటూ వారిని సంఘటితం చేసే ప్రయత్నం చేశారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని గుర్తు చేస్తూ ప్రసంగం ఆద్యంతం ఆదివాసులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. అమిత్ షా చేసిన ప్రసంగం పై ఆదివాసుల్లోనూ ఆసక్తి కనిపించింది ఇది తమకు లాభం చేకూరుస్తుందని బిజెపి శ్రేణులు ఆశతో ఉన్నాయి.

Tags:    

Similar News