వెయిట్ అండ్ సీ.. జంప్ జిలానీల వ్యూహాత్మక మౌనం

అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానానికి ఎలాగైనా పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్న నేతలు సమయం కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నారు.

Update: 2023-05-10 03:02 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానానికి ఎలాగైనా పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్న నేతలు సమయం కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థులను మారుస్తారని అధికార పార్టీ నుంచి సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడే పార్టీ మారకుండా వెయిట్ అండ్ సీ అన్నట్టుగా పలువురు నేతలు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వీరంతా వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ రాని పక్షంలో ఏ పార్టీలో చేరాలన్నది కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కేవలం నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే అధికార పార్టీ అభ్యర్థులు గట్టెక్కే అవకాశం ఉందని, మిగతా ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయావకాశాలు ఆశాజనకంగా లేవని అధిష్టానానికి నివేదిక అందినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ స్వయంగా తెప్పించుకున్న అత్యంత రహస్య నివేదిక మేరకు త్వరలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వేచి చూడడమే కరెక్ట్..?

గులాబీ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు ఇప్పటికిప్పుడే పార్టీ వీడకుండా కొంతకాలం వేచి చూడడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. కొందరు నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద అసంతృప్తితో ఉన్నప్పటికీ ఇప్పుడే బయటపడకుండా ఎదురుచూస్తున్నారు. ఒకరిద్దరి నేతలు బహిరంగంగా ఓపెన్ అయినప్పటికీ పార్టీని వీడే విషయంలో ఆచితూచి అడిగేస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగు రామన్నను లోక భూమారెడ్డి, బాలూరి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

బోత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాపురావును మాజీ ఎంపీ జి.నగేష్, నేరడిగొండ జెడ్పీటీసీ సభ్యుడు అనిల్ జాదవ్ వ్యతిరేకిస్తూ తమ కార్యకలాపాలను చాప కింద నీరుల కొనసాగిస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని మాజీ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు, పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ వ్యతిరేకించడమే గాక తమ సన్నిహితులతో బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖ నాయక్ పై జాన్సన్ నాయక్, పూర్ణచందర్ నాయక్ తదితరులు వ్యతిరేకిస్తూ తమ కార్యకలాపాలు నడుపుతున్నారు. మంచిర్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావును కాదని తనకు టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఆసిఫాబాద్ లో ఆత్రం సక్కును జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవలక్ష్మి వ్యతిరేకిస్తూ టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ నేతలు అసంతృప్తితో ఉన్నప్పటికీ బయటపడకుండా ఉంటున్నట్లు సమాచారం. కాగా, ఆ నియోజకవర్గాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు లేకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ అధికార పక్షంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్న సమాచారం అధిష్టానానికి సైతం సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది నేతలు పార్టీకి దూరం అవుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా ఆ నేతలు వెంటనే పార్టీని విడవకుండా వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.

కన్నడ ఎన్నికల ఫలితాల దాకా..

అధికార పార్టీని వదిలిపెట్టి ఇతర పార్టీలోకి వెళ్లే ఆలోచనతో ఉన్న నేతలు కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల ఫలితాలు వచ్చే దాకా వేచి చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయాలను బట్టి తెలంగాణలో ఉన్న రాజకీయ సమీకరణలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. అదే పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కనిపిస్తుంది. భారత్ రాష్ట్ర సమితి పార్టీని వీడితే బీజేపీలో చేరాలా, లేదంటే కాంగ్రెస్ వైపు వెళ్లాలా అనే ఆలోచనతో తమ సన్నిహితులు పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ఫలితాలను బట్టి తాము ఏ పార్టీలోకి వెళ్లాలో ఫలితాల తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News