బాబోయ్.. కొండ చిలువల గుట్ట..
ఓ గుట్ట వద్ద 10 కొండ చిలువలను పట్టించిన ఘటన మరవక ముందే గ్రామస్తులకు అదే గుట్టలో బుధవారం మరో భారీ కొండచిలువ కనిపించడం భయాందోళనకు గురిచేస్తోంది.
దిశ, లక్షెట్టిపేట : ఓ గుట్ట వద్ద 10 కొండ చిలువలను పట్టించిన ఘటన మరవక ముందే గ్రామస్తులకు అదే గుట్టలో బుధవారం మరో భారీ కొండచిలువ కనిపించడం భయాందోళనకు గురిచేస్తోంది. నివాస గృహాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆసుపత్రిని ఆనుకొని ఉన్న గుట్టవద్ద కొండచిలువ సంచారం గ్రామస్తులను బెంబేలెత్తిస్తోంది. లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ గడిగుట్ట నివాస గృహాలకు పక్కన ఉంటుంది. ఈ గుట్ట బొరియల్లో 2022 మార్చి 8న 10 భారీ కొండచిలువలు కనబడడంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించారు.
తాజాగా ఇవాళ అటువైపుగా వెళ్లిన కొందరు యువకులకు గుట్టబొరియలో భారీ కొండచిలువ కనబడింది. ఈ విషయం గ్రామంలో పాకడంతో దాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. ఇటీవల గుట్టవద్ద మరిన్ని కొండచిలువలు తమకు తారసపడ్డాయని కొందరు యువకులు తెలిపారు. కొండ చిలువలతో జనానికి, అటువైపుకు వెళ్లే పశువులకు ప్రాణాపాయం ఉందని అంటున్నారు. అటవీశాఖ అధికారులు గుట్టవద్ద బొరియలో ఉన్న కొండచిలువను పట్టుకొని అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.