కీలక దశకు చేరుకున్న లిక్కర్ కేసు దర్యాప్తు.. రాష్ట్రవ్యాప్తంగా అదనపు పోలీసు భద్రత!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ హెడ్ క్వార్టర్‌లో విచారిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు, కేంద్ర పారామిలిటరీ బలగాల భద్రత పెరిగింది.

Update: 2023-03-21 09:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ హెడ్ క్వార్టర్‌లో విచారిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు, కేంద్ర పారామిలిటరీ బలగాల భద్రత పెరిగింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ముందు పారా మిలిటరీ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు మోహరించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం సొంతంగా చొరవ తీసుకుని ప్రైవేటు సెక్యూరిటీని అదనంగా నియమించుకోగా కేంద్ర, రాష్ట్ర పోలీసులు బలగాలు కూడా చేరుకుంటున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లోని కీలక ప్రాంతాల్లో పోలీసు భద్రత పెంచాల్సిందిగా వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

రాష్ట్రంలోని కీలక బీజేపీ నేతల నివాసాలు, ఆఫీసుల దగ్గర కూడా అదనపు భద్రత సాయంత్రంకల్లా ఏర్పాటు కానున్నట్లు కేంద్ర వర్గాల నుంచి సమాచారం అందింది. కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా విచారిస్తున్నందున అక్కడ కూడా సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఢిల్లీ రాష్ట్ర పోలీసు భద్రత ఏర్పాటైంది. కవితను అరెస్టు చేసే అవకాశముందంటూ అటు బీఆర్ఎస్ వర్గాల్లో అనుమానాలు బలపడడం, రాజకీయ దురుద్దేశంతోనే ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను కేంధ్ర ప్రభుత్వం ఉసిగొల్పుతున్నదని నేతలు వ్యాఖ్యానిస్తున్న సమయంలో ఈ భద్రత ఏర్పాటవుతుండడం గమనార్హం.

రాజకీయంగా ఎదుర్కోలేకనే కవిత లాంటి మహిళలను ఈడీ ఇబ్బంది పెడుతూ ఉన్నదని, విచారణ పేరుతో వేధిస్తూ ఉన్నదని రాష్ట్ర మంత్రి శ్రీనివాసగౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన నిమిషాల వ్యవధిలోనే హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసు, బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర అదనపు భద్రత ఏర్పాటవుతుండడం విశేషం. ఈడీ ఆఫీసు ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు, భారత్ జాగృతి వాలంటీర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అప్రకటితంగా అమలవుతున్నది. పరిస్థితికి అనుగుణంగా నగర పోలీసులు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News