బస్సులపై ఉక్కుపాదం.. 9 రోజుల్లోనే 575 కేసులు

బస్సు ప్రమాదాలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రవాణాశాఖ అధికారులు బస్సు తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.

Update: 2024-06-24 13:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బస్సు ప్రమాదాలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రవాణాశాఖ అధికారులు బస్సు తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ నెల 12 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో పాఠశాలలు, స్కూల్ బస్సు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బృందాలుగా ఏర్పడి తనిఖీ చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి 20వ తేదీవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిట్ నెస్ లేని బస్సులను 489 సీజ్ చేసినట్లు ట్రాన్స్ పోర్టు జాయింట్ కమిషనర్(ఐటీ)మమత తెలిపారు. ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకొని 575 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని వెల్లడించారు. ప్రతి విద్యాసంస్థ యజమానులు విధిగా స్కూల్ బస్సులకు ఫిట్ నెస్ పరీక్షలు చేయించడంతో పాటు ప్రైమరి కిట్‌లు ఉండాలని, రవాణాశాఖ ఆదేశాలు పాటించాలని సూచించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో...

గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యాసంస్థల బస్సులపై స్పెషల్‌డ్రైవ్ కొనసాగుతుందని ట్రాన్స్‌పోర్టు జాయింట్ కమిషనర్ సి.రమేష్ తెలిపారు. గ్రేటర్ పరిధిలోని విద్యాసంస్థలకు 12631 బస్సులు ఉన్నాయని, అందులో హైదరాబాద్ పరిధిలో 1290, మేడ్చల్ మల్కాజ్ గిరి పరిధిలో 5609 బస్సులు, రంగారెడ్డి పరిధిలో 5732 బస్సులు ఉన్నాయన్నారు. అందులో హైదరాబాద్ లో 1135 బస్సులు, మల్కాజ్ గిరి పరిధిలో 5227 బస్సులు, రంగారెడ్డిలో 5251 బస్సులు ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాయన్నారు. ఇంకా హైదరాబాద్ పరిధిలో 155 బస్సులు, మల్కాజ్ గిరి పరిధిలో 382 బస్సులు, రంగారెడ్డిలో 481 బస్సులు ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకొని సర్టిఫికెట్ పొందాల్సి ఉందన్నారు.

ఈ నెల 12 నుంచి 20వ తేదీవరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో గ్రేటర్ పరిధిలో296 కేసులు నమోదు చేశామని, 247 బస్సులను సీజ్ చేశామని తెలిపారు. హైదరాబాద్ లో 154 బస్సులు, మల్కాజ్ గిరిలో 72 బస్సులు, రంగారెడ్డిలో 70 బస్సులపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. అదే విధంగా హైదరాబాద్ పరిధిలో 113 బస్సులు, మల్కాజ్ గిరిలో 67 బస్సులు, రంగారెడ్డిలో 67 బస్సులను సీజ్ చేశామని వివరించారు. ఈ డ్రైవ్ తో ఫిట్ నెస్ సర్టిఫికెట్, ట్యాక్స్, ఫైనాల్టీ ద్వారా ప్రభుత్వానికి 20.86 లక్షల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. విద్యాసంస్థల యజమానులు విధిగా బస్సులకు ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకోవాలని, విద్యార్థులు ప్రమాదాల బారినపడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


Similar News