హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో కోనో కార్పస్ చెట్లపై చర్యలు

కోనో కార్పస్ చెట్లు ప్రమాదకరమని, వీటిని నరికి వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

Update: 2025-03-29 01:41 GMT
హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో కోనో కార్పస్ చెట్లపై చర్యలు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : కోనో కార్పస్ చెట్లు ప్రమాదకరమని, వీటిని నరికి వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. అయితే వీటిని పూర్తిగా నరికి వేయాలని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిని 2021, 2022లో నిర్వహించిన హరితహారం లో ఎక్కువగా నాటినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిని పూర్తిగా నరికి వేయకుండా నియంత్రించాలని నిర్ణయించినట్లు పురపాలక శాఖ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.

పిట్టలు తినవు.. తొండలు గుడ్లు పెట్టవు..

శంఖు రూపంలో (కోన్ ఆకారం)లో పచ్చగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించే కోనో కార్పస్ చెట్లు రహదారుల వెంబడి డివైడర్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. నగరాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు వివిధ దేశాలు గుబురుగా పెరిగే ఈ చెట్లను ఆదరించాయి. ఈ చెట్లకు సంబంధించిన పువ్వులు, పండ్లు లక్షల్లో ఉంటాయి. కానీ వీటిని ఎలాంటి పిట్టలు తినవు. ఈ చెట్లపై తొండలు కూడా గుడ్లు పెట్టవు. ఈ చెట్లు నీటిని కూడా అధికంగా తీసుకుంటాయి. వీటి వల్ల మానవ ఆరోగ్యానికి హానికరమని ఫారెస్ట్, హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. ఈ చెట్లు ఎంత పైకి పోతుంటే అంతా లోతులో తన వేళ్ళను విస్తరించు కుంటుంది. దీంతో భూమిలో ఉన్న డ్రైనేజ్ పైపులను కూడా నాశనం చేస్తాయి. ఈ మొక్క రెండు సంవత్సరాల్లో రెండు సార్లు పరాగసంపర్కం చేస్తుంది. పరాగసంపర్కం చేసేటప్పుడు వచ్చే పుప్పొడి మనుషుల్లో దగ్గు, జలుబు, ఉబ్బసం, శ్వాసకోశ రుగ్మతలు అధికంగా వచ్చేలా చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

హెచ్ఎండీఏ పరిధిలో..

హెచ్ఎండీఏ పరిధిలో ఈ మొక్కలను ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలోని రోడ్లు, రోటరీల్లో ఎక్కువగా నాటారు. దీంతోపాటు ఆయా జిల్లాలకు వెళ్లే ప్రధాన రోడ్లలో కూడా వీటిని ఎక్కువగానే నాటారు. సుమారు లక్షకుపైగా ఈ మొక్కలను నాటినట్లు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు చెబుతున్నారు. అయితే వీటిని పూర్తిగా నరికి వేయకుండా వాటిని నియంత్రించాలని అధికారులు నిర్ణయించారు. చెట్లు పోడవుగా పెరగకుండా ఎప్పటికప్పుడు గ్లోబ్, శంకువు ఆకారంలో అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.

అటవీ శాఖకు లేఖ..

కోనో కార్పస్ చెట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని, దీనిపై స్పష్టత ఇవ్వాలని అటవీశాఖకు పురపాలక శాఖ అధికారులు లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్టు పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ చెట్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఈ మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నుంచి సర్క్యూలర్ వచ్చిందని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సెంట్రల్ మీడియన్స్, ఆయా పార్క్‌లో వీటిని నాటారు. వీటిని పూర్తిగా నరికి వేయకుండా నియంత్రించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.

స్థానిక మొక్కలకే..

రెండేండ్ల నుంచి కొత్తగా కోనో కార్పస్ మొక్కలు నాటడం లేదని పురపాలక శాఖ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. నర్సరీల్లో పెంచకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక మొక్కలకే ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఎక్కువగా పువ్వులు, పండ్లు కాసే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి.

Similar News