RTC ప్రయాణికులకు శుభవార్త.. మార్చి నుంచి అందుబాటులోకి!
ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే విషయంలో టీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే విషయంలో టీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మార్చి నుంచి రాష్ట్రంలోనే తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో ఏసీ స్లీపర్ బస్సు నమూనాను సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. తొలి దశలో మొత్తం 16 బస్సులను ప్రారంభించనున్నారు.ఈ బస్సులు కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో నడిపేందుకు సంస్థ కసరత్తు చేస్తోంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరి అని నామకరణం చేశారు.
బస్సు ప్రత్యేకతలివే!
12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంటుంది. బెర్త్ ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి బెర్త్ వద్ద రీడిండ్ ల్యాంప్ లను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసందానం చేస్తారు. ఈ బస్సుల్లో వైఫై సౌకర్యం కూడా ఉంటుంది. ప్రతి బస్సులో రెండు సీసీ కెమెరాలు, అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు.