హైద్రాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు సౌత్ ఇండియా రీజినల్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని దక్షిణ భారత అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు సుధా నాగేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు సౌత్ ఇండియా రీజినల్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని దక్షిణ భారత అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు సుధా నాగేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం నల్లకుంటలోని కార్యాలయంలో సుప్రీంకోర్టు న్యాయవాది వినాయక్‌రావు, హైకోర్టు న్యాయవాది భూపాల్‌రాజ్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు సౌత్ ఇండియా రీజినల్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో దక్షిణ భారత అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు రీజినల్ బెంచ్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నల్లకుంటలోని దక్షిణ భారత అడ్వకేట్ జేఎసీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
సమావేశానికి సుప్రీంకోర్టు న్యాయ వాదులు, మేధావులు, పలువురు ప్రముఖులు హాజరవుతారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు సౌత్ ఇండియా రీజినల్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పై ఈ సమావేశంలో చర్చించి కార్యాచరణ రూపకల్పన చేస్తామన్నారు.